Free buttermilk | కోల్ సిటీ, మే 1: ఒకవైపు అడుగు బయట పెడితే అగ్గే.. ఒకటే దగడు.. వడగాలులు.. ఎండ తీవ్రతతో రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో కొద్దిరోజుల నగర ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకవేళ అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు ఎండ వేడిమి తట్టుకోలేక వడదెబ్బకు గురవుతున్నారు. ఈ సంఘటనలు చూసిన రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు చలించిపోయారు. వివిధ అవసరాల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు వడదెబ్బకు గురికాకుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చారు. అందుకోసం ప్రతీరోజు వెయ్యి మందికి తగ్గకుండా ఉచితంగా మజ్జిగ అందించాలని నిర్ణయించారు.
ఆలోచన వచ్చిందే తడవుగా గురువారం నుంచే ఆ బృహత్తర సేవకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రజల రాకపోకలకు ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రంను రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మొదటి రోజు రామగుండం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్ రావు-విజయలక్ష్మి దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెయ్యి మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీకి చేయూత అందించారు. ఇప్పటినుంచి ఎండాకాలం పూర్తిగా ముగిసేంతవరకు వ్యయ ప్రయాసలకు ఆలోచించకుండా క్లబ్బు సభ్యుల సహకారంతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మంచినీళ్లు దొరుకుడే గగనంగా ఉన్న ఈ పరిస్థితిలో ఆరోగ్యానికి దోహదపడే మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తున్న రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు తో పాటు ఉపాధ్యక్షుడు విక్రమ సింహరావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ చెరుకు బుచ్చిరెడ్డి, కోశాధికారి తూముల అశోక్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు నిట్టూరి, సభ్యులు రియాజ్ అహ్మద్, చందుపట్ల మల్లారెడ్డి, గొర్ల చెన్నారెడ్డి, కొమురవెల్లి సుధాకర్, జి.నాగేశ్వరరావు, కొల్లూరి శ్రీనివాస్, చెలుకలపల్లి తిరుపతి, డాక్టర్ కాశి పాక కుమారస్వామి, మునిగాల వెంకట్ శ్రీనివాస్ రావు, కొమురవెల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.