మెట్పల్లి, జూన్ 14: మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవీ నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేశ్, పాకాల రాకేశ్‌ను మెట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ సురేశ్‌కుమార్ వెల్లడించారు. మెట్పల్లి పట్టణంలోని ఐదో వార్డు (ఆరపేట) శివారులోని సర్వే నంబర్ 191లోని ఎనిమిది గుంటల భూమికి నకిలీ ఆబాది సర్టిఫికెట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసినట్టు గత నెలలో తహసీల్దార్ నీతా గుర్తించారు.
ఆ తర్వాత ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరుగురు కలిసి తప్పుడు పత్రాలు సృష్టించినట్టు ధ్రువీకరించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసులో నలుగురిని అరెస్టు చేశారు. బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉండగా, త్వరలోనే వీరిని పట్టుకుంటామని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ కిరణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.