సారంగాపూర్, మార్చి 7 : బీఆర్ అంబేద్కర్ని అవమానిస్తే యావత్ సమాజాన్ని అవమానించినట్లేనని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునుర్ గ్రామంలో కొందరు వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా చెప్పుల దండ వేసి అవహేళన చేశారు. దీన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కొందరు వ్యక్తుల చర్య దేశాన్ని, యావత్ సమాజాన్ని అవమానించడమే అవుతుందని దావ వసంత సురేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం విగ్రహానికే కాదు, అంబేద్కర్ సిద్ధాంతాలకు, రాజ్యాంగానికి, సమానత్వ స్వరూపంపై తీవ్రమైన, దుర్మార్గమైన దాడి అని వ్యాఖ్యానించారు. దీనిపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.