తిమ్మాపూర్, జూలై 14 : గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతెల్లి సమత భర్త రాజేందర్‌రెడ్డి మంగళవారం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడు గుండ్లపల్లికి చెందిన వంగల మురళీధర్‌రెడ్డి కారణమని సమత ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన వివరాలను బాధితుడి భార్య, మాజీ సర్పంచ్ విలేకరులతో తెలిపింది. తాము గ్రామాభివృద్ధిపై నిరంతరం ప్రశ్నించడాన్ని ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి మనసులో పెట్టుకొని తమను ఇబ్బందుల పాలు చేస్తున్నాడని ఆవేదన చెందింది. తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాడని వాపోయింది.
తమకు గ్రామంలో సిమెంట్ బ్రిక్స్ ఉందని, సోమవారం రాత్రి బిగుళ్ల శ్రవణ్, పైడిపాల మల్లేశం అనే వ్యక్తులు బ్రిక్స్ వద్ద మద్యం తాగుతుండగా.. ఇక్కడ ఎందుకు తాగుతున్నారని తన భర్త ప్రశ్నించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగిందని, ఇది కాస్త పెద్దగా మారిందని తెలిపింది. మరికొంత మంది కలిసి ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారని, తన భర్త సెల్‌ఫోన్‌ను పగులకొట్టడంతోపాటు దాడి చేశారని వాపోయింది. అనంతరం ఇరువర్గాలు గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా.. రాజేందర్‌రెడ్డితోపాటు పంబాల సంపత్, కొమ్మెర ప్రశాంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని వాపోయింది. తనపైనే దాడి చేసి, తనపైనే కేసు పెట్టడంతో తన భర్త తట్టుకోలేకయాడని, మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు చేరుకొని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడని రోదించింది.
గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి దవాఖానకు తరలించారని చెప్పింది. తాము అన్యాయాలను సహించబోమని, గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై తన భర్త గ్రామంలో, అలాగే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారని తెలిపింది. దీన్ని మనసులో పెట్టుకొనే మురళీధర్‌రెడ్డి.. తన భర్తపై దాడిచేయించి తిరిగి అక్రమంగా కేసు పెట్టించాడని ఆరోపించింది. దాడి చేసిన వారు ఎమ్మెల్యే పీఏ పేరు చెప్పారని తెలిపింది. తన భర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, ఎమ్మెల్యే ఇంటివద్ద కూర్చుంటానని స్పష్టం చేసింది. తాను సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించడానికి కష్టపడ్డానని, సొంతంగా ఖర్చు పెట్టుకున్నానని తెలిపింది. కానీ, అన్యాయాలపై ప్రశ్నిస్తే మురళీధర్‌రెడ్డి అక్రమంగా కేసు పెట్టించాడని వాపోయింది.