కలెక్టరేట్, మార్చి 19: రెండేళ్లుగా పెండింగ్‌లో(Pending bills) ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతదాకనైనా తెగిస్తామని, అవసరమైతే మావోయిస్టులుగా కూడా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు. బిల్లుల విడుదల కోసం శాంతియుత నిరసన చేపట్టేందుకు యత్నిస్తే, తమపై ఉక్కుపాదం మోపుతూ, అర్ధరాత్రులు ఇళ్ళలో నుంచి పోలీస్ స్టేషన్లకు తరలించటం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల కోసం మంత్రుల వద్దకెళ్లేందుకు ప్రయత్నిస్తే ఎక్కడి వారినక్కడ అడ్డుకుంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు.
బుధవారం అసంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఫిలిం భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం మాట్లాడుతూ గతంలో తాము ఇందిరాపార్కు ఎదుట బిల్లుల కోసం ధర్నా చేస్తే, ప్రతిపక్ష నేతగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క నిధుల విడుదలపై పలుమార్లు ఇచ్చిన హామీ బుట్టదాఖలు చేశారని దుయ్యబట్టారు.
ప్రభుత్వ అండతో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే అశాంతికి మూలకారకులవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన తమపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా మారి మాజీ సర్పంచులపై భౌతికదాుడులకు పాల్పడుతుండటం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు పంజాల జగన్మోహన్ గౌడ్, మేడి అంజయ్య, మేచినేని నవీన్‌రావు, కంకణాల విజేందర్ రెడ్డి, సిరిమల్ల మేఘురాజు, సురేందర్, గంగాధర్, ఆదిమల్లు, రామకృష్ణ, సమ్మయ్య, నజీర్ పాల్గొన్నారు.