Geetla Mukunda Reddy | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 19 : పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఈ నియోజక వర్గానికి చేసిన సేవలను ఈ ప్రాంత ప్రజలు మరువలేరని కూనారం గ్రామస్థులు, పలువురు నాయకులు పేర్కొన్నారు. గీట్ల ముకుందరెడ్డి 12వ వర్ధంతిని స్వగ్రామమైన కూనారం, కాల్వశ్రీరాంపూర్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనారం లో గీట్ల విగ్రహం వద్ద గ్రామస్థులతో పాటు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ గీట్ల చేసిన అభివృద్ధి ఈ నియోజక వర్గ ప్రజల మదిలో నిరంతరం గుర్తుంటుందన్నారు. వారి తోనే ఈ నియోజక వర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఆకాక్షించారు.
కూనారంలో సర్పంచ్ గా మొదలు పెట్టిన ఆయన రాజకీయ జీవితం పెద్దపల్లి సమితి అధ్యక్షునిగా, మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ఈ నియోజకవర్గానికి ఆయన ఎనలేని సేవలందించారన్నారు. గీట్ల ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. ప్రజలనుండి దూరమై 12 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన చేసిన అభివృద్ధి మాత్రం నిరంతరం గుర్తుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, సర్పంచ్ మంతని రాజయ్య, ఉప సర్పంచ్ తిరుపతి, నాయకులు కొల్లూరి రాజముల్లు, కొట్టె సమ్మయ్య, సంద రాములు, కుంభం రాజు, అశోక్, శంకర్, రమేశ్, దొమ్మటి రాజేందర్, కండె శ్రీశైలం తో పాటు పలువురు గ్రామస్తులు, గీట్ల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.