పెద్దపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ బిడ్డలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభ మన ఆత్మగౌరవ పండుగ అని, తెలంగాణ బిడ్డల పండుగ అని అభివర్ణించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిషరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ అని, తెలంగాణ ఆత్మగౌరానికి ప్రతీక అని అభివర్ణించారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే సభ యావత్ తెలంగాణ చరిత్రలోనే అత్యంత గొప్ప సభ అవుతుందని చెప్పారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి, ప్రజల్లో ఒక ఉత్సాహం రేకెత్తించడానికి ఈ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సుమారు పదివేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలను తరలిస్తామని, అందుకు సంబంధించి వాహనాలు సిద్ధం చేశామని చెప్పారు.
ఒక జాతరకు, ఒక తీర్థానికి వెళ్లేవారి లాగ రజతోత్సవ సభకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారన్నారు. 27న సాయంత్రం 5గంటలకు సభ ఉందని, ఉదయం 11 గంటల నుంచే అన్ని గ్రామాల నుంచి బస్సులు, వాహనాలు బయలు దేరుతాయని చెప్పారు. ఈ సభకు వెళ్లే ప్రజల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, మంచినీళ్లు, చల్ల ప్యాకెట్లు, అలాగే భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తానిపర్తి బాలాజీ రావు, పెద్దపల్లి, ఓదెల మండల అధ్యక్షులు మారు లక్ష్మణ్, ఐరెడ్డి వెంకట్ రెడ్డి, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, తానిపర్తి మోహన్ రావు, సయ్యద్ ముబీనుద్దీన్, నిదానపురం దేవయ్య, పూదరి చంద్ర శేఖర్, నెత్తెట్ల సతీష్, కమటపు శ్రీధర్, ప్రేమ్, శ్రీకాంత్, బైరం నటరాజ్, అతిక్, ముబాసిడర్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.