Chada Venkata Reddy | చిగురుమామిడి, జూన్ 12: రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ అనారోగ్యంతో మృతి చెందడం సీపీఐ పార్టీకి, ఆ కుటుంబానికి తీరనిలోటని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. చాడ శోభ అనారోగ్యంతో కరీంనగర్ లోని అపోలో రిచ్ హాస్పిటల్ లో మృతి చెందడంతో స్వగ్రామం రేకొండలో గురువారం జరిగిన అంత్యక్రియల్లో వెంకటరెడ్డి పాల్గొని ఆమె మృతదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఐ మండల నాయకత్వం శోభ మృతదేహంపై ఎర్ర జెండా, పార్టీ పతాకం కప్పి నివాళులర్పించారు. గ్రామ ఎంపీటీసీగా ప్రజలకుసేవలందించిన శోభ మృతదేహాన్ని కడసారి చూడడానికి పెద్ద ఎత్తున హాజరైన గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ చాడ శోభ మంచి మనసున్న మానవత్వం గల వ్యక్తి అని, గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునే మనస్తత్వం గలదని, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా నాయకునిగా పనిచేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ ప్రజలు, పేదలకు అండగా నిలిచిందని, ప్రజలకు మరింత ప్రజాసేవ చేయడానికి 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో 2020లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని, పార్టీ బలోపేతం కోసం గ్రామం, మండలంలో వారి కుటుంబం అంతా పనిచేస్తుందని, అలాంటి నాయకురాలు అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు.
శోభ ఆశయాలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్తపై ఉందని వెంకటరెడ్డి తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్ గౌడ్, మంద పవన్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల సీపీఐ కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ, అందె చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, యెడల వనేష్ ,కొమ్ముల భాస్కర్, జేరిపోతుల జనార్ధన్, కొయ్యడ కొమురయ్య, మాజీ మండల కార్యదర్శి ఎనగందుల రాజయ్య, మాజీ సర్పంచ్ లు గోలి బాపురెడ్డి, కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య, రాజేశ్వర్ రెడ్డి తో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.