మల్యాల, జూన్ 4 : రాబోయే రోజులు బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్నాయని, ఆందోళన చెందవద్దని రైతులకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ భరోసానిచ్చారు. మళ్లీ తప్పకుండా కేసీఆర్ అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్య పడొద్దని చెప్పారు. జగిత్యాల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు తండ్రి సురేందర్‌రావు ఇటీవల మృతి చెందగా, బుధవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి మేడిపల్లి మండలం రంగాపూర్‌కు వెళ్లి హరిచరణ్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆ తర్వాత కరీంనగర్ వెళ్తూ మార్గమధ్యలో మల్యాల మండలం రాంపూర్ ప్రధాన బస్టాండ్ చౌరస్తా వద్ద స్థానిక రైతులు అభివాదం చేయడంతో ఆయన అక్కడ ఆగారు. రైతుల ఆహ్వానం మేరకు టీ తాగి ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు నాటి రోజులను యాది చేసుకున్నారు. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండే. ఇప్పటి కూడా ప్రజలందరూ ఆయననే యాదిచేసుకుంటున్నరు. ఎవరైనా ఆయనను ఏమన్నా అంటే పురుగులుపడి చస్తరు’ అంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. మళ్లీ ఆ సారే వస్తడని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడారు.
కేసీఆర్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సంపదను పెంపొందించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పల్లెలు పట్టణాల తరహాలో అభివృద్ధి చెందాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాల అమలు కోసం కొంత సమయం ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తరహాలో క్షేత్రస్థాయిలో నిరసనలు తెలుపుతామని స్పష్టం చేశారు.
మీలాంటి రైతుల సహకారం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండపలుకుల రామ్మోహన్రావు, పునుగోటి కృష్ణారావు, ఓరుగంటి రమణారావు, జనగం శ్రీనివాస్, పులి వెంకటేశ్‌గౌడ్, నవీన్‌రావు, కొరండ్ల నరేందర్‌రెడ్డి, బద్ధం తిరుపతిరెడ్డి, మిట్టపల్లి దశరథం, బద్ధం తిరుపతి, క్యాతం భూపతిరెడ్డి, కాకెర సుదర్శన్, నల్ల రవీందర్, పోగుల పెద్దరాజం, కాకెర తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.