రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : దేశంలోనే ఆదర్శంగా సేవలందించిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) లైసెన్స్‌ను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. లేకుంటే వినియోగదారులు, రైతు సంఘాల నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదని, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని హితవు పలికారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కో ఆపరేటివ్ సంస్థ సేవలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. లాభాల్లో ఉన్న సెస్‌ను నష్టాల్లో ఉందంటూ దుష్పచారం చేస్తున్నారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేశారు. సంస్థకు 700 కోట్లు బకాయిలు ఉన్నది ప్రభుత్వమేనని ఆరోపించారు. మార్చి 31తో సెస్ లైసెన్స్ గడువు ముగిసినా ప్రభుత్వం ఎందుకు పునరుద్ధరణ చేయడం ప్రశ్నించారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి సెస్ సేవలు ఎన్పీడీసీఎల్ పరిధిలో కొనసాగుతాయని చెప్పారని, అసలు సెస్ ఉంటుందా.. లేదా..? అనేది కనీస స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని మండిపడ్డారు. సెస్‌ను కాపాడుకునేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారని తెలిపారు. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించాలని, సెస్ విలీనంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెస్‌ను కాపాడుకుంటామని, పార్టీలకతీతంగా రాజకీయ, కార్మిక, రైతు సంఘాల నాయకులు సంఘటితమై జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, నాయకులు బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, ఎండీ సత్తార్, జక్కుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సెస్ విలీనం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రేవంత్‌రెడ్డి సర్కారు విధ్వంసకర ఆలోచనతో సెస్‌ను స్వాధీనం చేసుకునే దిశగా కుట్రలు చేస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో సెస్‌ను కాపాడుకునేందుకు సెస్ పాలకవర్గంతోపాటు పార్టీ నాయకులందరం ముందుకెళ్తం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తం.
దేశంలోనే ప్రప్రథమంగా 1970లో సిరిసిల్ల సెస్ ఏర్పాటైంది. ఈ సెస్ సేవలను ఆదర్శంగా తీసుకొని అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మరో వంద సొసైటీలు ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రతి పన్నెండేళ్లకోసారి ఒక సహకార సంవత్సరంగా డిక్లేర్ చేయాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహకార శాఖకు మంత్రిగా ఉన్నారంటే సహకార రంగానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం గ్రామానికో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘం పరిధిలో నడుస్తున్న సెస్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేయడం సిగ్గు చేటు. ప్రభుత్వమే 700 కోట్లు బకాయి ఉండి సంస్థ నష్టాల్లో ఉందనడం సరికాదు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజకీయ కోణంలో ఆలోచన చేయద్దు. సెస్ పరిధిలో సేవలను పరిగణలోకి తీసుకోవాలి. సంస్థను యధాతథంగా కొనసాగించాలి.