హుజూరాబాద్ రూరల్, జూన్ 7: బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, బూత్ స్థాయిలో చేపట్టి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ సిద్ధాంతాలు, ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి సభ్యత్వం నమోదు చేయించాలని కోరారు.
అర్హులందరీ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు. బీఆర్ఎస్ సభ్యత్వ, ఓటరు నమోదు కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని, బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు లక్ష్య సాధన, ఓటరు నమోదు కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని కోరారు. ఇక్కడ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, రమేశ్, గందె శ్రీనివాస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.