రాజన్న సిరిసిల్ల, మే 1 (నమస్తే తెలంగాణ) : కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, పదేండ్ల పాలనలో అనేక పథకాలు అమలు చేసి అండగా నిలించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేలా బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చి బతుకులకు భరోసా కల్పించిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి లేకుండా ఆగం చేసిందని ధ్వజమెత్తారు.
కార్మిక వర్గాల్లో చైతన్యం, ఐక్యత లేదని, హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. మేడే సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల లేబర్ అడ్డా వద్ద గురువారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు బాగుంటేనే పల్లెలు, పట్టణాలు పచ్చగా ఉంటాయని భావించిన కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, కార్మికుల వేతనాలు పెంచారని, సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలను నివారించేందుకు బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని చూపారని విషయాన్ని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆర్డర్లు ఇచ్చి కూలీ తగ్గించిందని, దినదినం కూలీ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అంటూ ప్రశ్నించారు.
ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ చొరవ తీసుకుని కూలీ రేట్లు తగ్గించుకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికుడినే యజమాని చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ సంకల్పంచి సిరిసిల్ల అప్పారెల్ పార్కులో 1100 షెడ్లను నిర్మించినట్టు గుర్తు చేశారు. ప్రతి కార్మికుడికి సాంచాలు ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు.
కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వర్కర్‌టూ ఓనర్ పథకాన్ని ఇంత వరకు ప్రారంభించలేదని, దీనిని చూస్తే నేతన్నలపై ఈ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. నేతన్నలు, ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రక్తాన్ని చెమటగా మార్చి కడుపు నింపుకుంటున్న కార్మికుల డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలన్నారు. తాను కచ్చితంగా కార్మికుల పక్షపాతినేనని, విద్యార్థి దశ నుంచి కార్మికుల కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు.
భవన నిర్మాణ కార్మికుల కోసం ఎంతో కొట్లాడానని చెప్పారు. మరణించిన కార్మిక కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఆ పోరాట ఫలితంగానే వస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.