రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): 420 హామీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. అరచేతిలో వైకుంఠం చూపి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్ని వర్గాలకూ బాకీ పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు దీటుగా బీఆర్ఎస్ పార్టీ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను తెచ్చిందని చెప్పారు. ఆ బాకీ కార్డు ఇంటింటికీ చేరాలని, ఆ పార్టీ మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డును ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు చాలా మోసపోయారని, అందుకే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గ్రామాలకు వెళ్లి ఓట్లడిగే సాహసం చేసే పరిస్థితి లేదన్నారు. బాకీ కార్డు ఎన్నికలొచ్చినందుకు కాదని, ఎలక్షన్లు వాయిదా పడ్డా ప్రజలకు వివరించే కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు.
గ్యారెంటీల పేరిట మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఢిల్లీకి సంచులు మోస్తున్నాడని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్‌తోపాటు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు అవసరముంటేనే ఢిల్లీకి వెళ్లే వారని, కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ రాజులు పిలువకున్నా వెళుతున్నారని, తీరా అక్కడికి వెళ్లాక రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరక్క వాపస్ వస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఇస్తున్న నియామక పత్రాలు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించినవేనని నిరుద్యోగులు సైతం చెబుతున్నారని ఆయన దెప్పి పొడిచారు.
ఉద్యోగాలు అడిగిన పాపానికి నిరుద్యోగుల పిల్లల్ని చితకొట్టింది ఈప్రభుత్వమేనని మండిపడ్డారు. విద్యాభరోసా 5లక్షల కార్డు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, బొల్లి రాంమోహన్, దార్నం లక్ష్మీనారాయణ ఉన్నారు.
అన్ని వర్గాలకూ బాకీ
కాంగ్రెస్ అన్ని వర్గాలకూ బాకీ పడింది. మహిళలకు నెలకు 2500 చొప్పున 22నెలలకు ఒక్కొక్కరికి 55వేల బాకీ పడ్డది. వృద్ధులకు డబుల్ పింఛన్ 44వేలు, వికలాంగులకు 64వేలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద పెండ్లయిన ప్రతి మహిళకు తులం బంగారం, రైతు భరోసా 15వేల చొప్పున 76వేలు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేల చొప్పున రెండేళ్లకు 24 వేలు బాకీ పడ్డది. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి ఇవ్వలేదు. ఎన్నికల్లో గ్యారెంటీ కార్డును రిలీజ్ చేసి అమలు చేయలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ.. ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను తెచ్చింది. బాకీ కార్డును గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తాం.
– బోయినపల్లి వినోద్ కుమార్
ప్రజలను మోసం చేసింది
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. పాలన చేతగాక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలోకి ఎక్కింది. సీఎం గురించి ప్రజలు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో చూస్తే ఆయన పాలన ఎలా ఉందో అర్థమైపోతున్నది. ఆనాడు హామీలు అమలు చేస్తామంటూ ఢిల్లీ పెద్దలు బాండ్ పేపర్లు రాసి ఎగనామం పెట్టిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదు. గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తాం.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
క్షమాపణ చెప్పాలి
ఎన్నికల ముందు కాంగ్రెస్ 420 హామీలకు గ్యారెంటీ కార్డు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా అసత్య ప్రచారం చేస్తున్నది. ఒక్క బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు మాటలు చెబుతున్నది. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. ఆ పార్టీకి కాలం చెల్లింది. మోసపు మాటలు, ఆరు గ్యారెంటీల గారడీలను ప్రజల ముందు పెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ బాకీ కార్డును తెచ్చింది. ఆ పార్టీ మోసాలను బేషరతుగా అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి
ప్రజాపాలన కాదు.. గోసపెట్టే పాలన
కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేసింది. రైతుబంధు కింద కేసీఆర్ ఎకరాకు 10వేలు ఇస్తే.. 15వేలు ఇస్తామంటూ మభ్యపెట్టి ముంచింది. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వలేదు. యూరియా కోసం మహిళా రైతులు పసిబిడ్డలను చంకలో పెట్టుకొని లైన్ కట్టాల్సిన దుస్థితి తెచ్చిన రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్డ్ మోడల్‌గా నిలిపితే, రేవంత్‌రెడ్డి వచ్చి నాశనం పట్టిస్తున్నడు. అభివృద్ధిలో ఇరవై ఏండ్లు వెనుక పడేసిండు. ఇది ప్రజా పాలన కాదు, గోసపెట్టే పాలన. బాకీ కార్డుతో కాంగ్రెస్ మోసాలను ఎండగడతం. ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నరు. ఎన్నికలు ఏవైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండి సత్తాచాటాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే