కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వస్తుందని విశ్వసించిన మొదటి వ్యక్తి కేసీఆరేనని, ఆయన గొప్ప మార్గనిర్దేశకుడని తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు అభివర్ణించారు. తాము ఉద్యమమే స్ఫూర్తిగా బతికామని, జలదృశ్యంలో పార్టీ ఆవిష్కరించినప్పుడు ఉన్న కొద్ది మందిలో తాను ఒకడిగా ఉన్నానని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏండ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు, అవమానాలను ఎదుర్కొన్నామని, అయినా పార్టీ మాత్రం ఏ మాత్రం చెక్కు చెదర లేకపోగా రోజు రోజుకూ మరింత బలపడిందని యాది చేసుకున్నారు. ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్)ని స్థాపించి 24 వసంతాలు పూర్తయి 25వ ఏట అడుగిడుతున్న నేపథ్యంలో ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం ‘నమస్తే తెలంగాణ’తో నారదాసు మాట్లాడారు.
పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే కేసీఆర్‌తో నడిచారని, అందుకు తనకు తగిన గుర్తింపు దక్కిందని, పార్టీలో పొలిట్‌బ్యూరోలో స్థానం, రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పారు. కేసీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని, జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణ వస్తుందని విశ్వసించిన మొదటి వ్యక్తి కేసీఆరే. ఆయన పార్టీ పెట్టక ముందు నుంచే నేను ఆయనతో కలిసి నడుస్తున్న. ఏప్రిల్ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రకటించినపుడు కొందరు వ్యక్తుల్లో ఒకడిగా నేను ఆయన వెంట ఉన్న. పార్టీ స్థాపించిన తర్వాత మొదటి బహిరంగ సభ కరీంనగర్లో పెట్టాలని జిల్లాలోని ముఖ్యులతో కేసీఆర్ చర్చించారు.
2001 మే 17న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సింహగర్జన సభకు మేం 70వేల నుంచి లక్ష మంది జనం వస్తారని అనుకున్నం. కానీ, ఊహించని రీతిలో లక్షలాది మంది తరలివచ్చారు. ఆ తర్వాత కూడా కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఇక్కడి ప్రజలు వెన్నంటే నిలిచారు. అదే మమకారంతో కేసీఆర్ కరీంనగర్ గడ్డ నుంచే అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనేక వ్యూహాలు రచించారు. 2009 నవంబర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న విషయాన్ని ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశాం. అరెస్ట్‌కు ముందు అంటే 2009 నవంబర్ 26న కేసీఆర్ కరీంనగర్ వచ్చారు. 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని సబ్బండ వర్గాలతో కరీంనగర్‌లోనే చర్చలు జరిపారు. 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్దిపేటకు తరలివెళ్తుండగా అల్గునూర్‌లో అరెస్ట్ చేశారు.
తర్వాత తెలంగాణ ఏర్పడింది. పార్టీ స్థాపించిన 24 ఏండ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు, అవమానాలను ఎదుర్కొన్నం. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి రాష్ర్టాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిపారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీ మరింత బలోపేతమైంది. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్నది. ప్రతి కార్యకర్తలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగులుతున్నది. ప్రజలు కూడా మా పార్టీవైపే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అందుకే లక్షలాది మందిని తరలించి సభను విజయవంతం చేయాలని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తున్నారు.