కోల్‌సిటీ/ మల్యాల, సెప్టెంబర్ 19 : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా ‘ప్రతి ఊరికో జమ్మి చెట్టు.. ప్రతీ గుడికో జమ్మి చెట్టు’ నినాదంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఆలయాల్లో జమ్మి మొక్కలు నాటారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని జవహర్‌నగర్‌లోని హనుమాన్ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్యన జమ్మి మొక్కకు పూజ చేసి, నాటారు. అనంతరం సెల్ఫీ దిగి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న సన్నిధానంలో జమ్మి మొక్కను నాటారు. ముందుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ టీం సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన జమ్మి చెట్టును గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా గుర్తించిందని గుర్తు చేశారు. జమ్మి చెట్టును ప్రతి ఊరిలో.. ప్రతి గుడిలో నాటాలన్నదే గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్దేశమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తిగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఏటా దసరా పండుగకు ముందు జమ్మి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు బాధ్యతగా తీసుకొని ప్రతి ఊరిలో.. ప్రతి గుడిలో జమ్మి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో బీఆర్ఎస్ నాయకులు జేవీ రాజు, మారుతి, కోడి రామకృష్ణ.. కొండగట్టులో నాయకులు రాంమోహన్‌రావు, పునుగోటి కృష్ణారావు, బోయినిపల్లి మధుసూదన్‌రావు, బద్దం తిరుపతిరెడ్డి, కోరండ్ల నరేందర్‌రెడ్డి, జనగం శ్రీనివాస్, గడ్డం రాజేశం, బద్దం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.