గంగాధర, ఆగస్టు 20 : రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ అధ్వానంగా మారిందని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి విద్యారంగం ఎటుపోతున్నదో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నా ఆయనకు పట్టదా..? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యను, విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
460 విద్యార్థులు అభ్యసిస్తున్న గంగాధర మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల అద్దె భవనంలో అసౌకర్యాల మధ్య కొనసాగుతుండగా, బుధవారం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. జ్వరం, కళ్ల కలకతో బాధపడుతూ గదిలో నేలపైనే పడుకున్న విద్యార్థులను పరామర్శించారు.
ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్ వంటి వాటిని సరఫరా చేస్తున్న ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఏడాది క్రితం పాఠశాల ఆవరణలో కరెంటు తీగల తెగిపడి విద్యార్థులు గాయపడ్డారని, వాటిని తొలగించాలని కోరినా ఇప్పటి వరకు తొలగించలేదని మండిపడ్డారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు స్పందించరా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. డార్మెటరీలో బెడ్స్ లేక విద్యార్థులు నేలపైనే పడుకుని ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వారం రోజుల నుంచి పప్పునీళ్లతోనే విద్యార్థులు భోజనం చేస్తున్నారని, ఈ విషయాన్ని స్వయంగా వంట చేసే వారు ఒప్పుకున్నారని తెలిపారు. వెంటనే విద్యార్థులకు వసతులు కల్పించాని, నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాగి మహిపాల్‌రావు, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, దూలం శంకర్‌గౌడ్, పంజాల అంజనేయులు, శ్రీమల్ల మేఘరాజు, మామాడిపెల్లి అఖిల్, నిమ్మనవేణి ప్రభాకర్ ఉన్నారు.