గంగాధర, మార్చి 13: చొప్పదండి నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించకుంటే ధర్నా చేస్తామని ముందే హెచ్చరించామని, రైతు ధర్నాలో నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అక్రమంగా అరెస్టు చేస్తారా..? అని మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ నిలదీశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చివరి ఆయకట్టు వరకు నీరిస్తానని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు సాగునీరు ఇవ్వాలని రైతుల కోరితే వారిపై బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆయన పేరు మేడిపల్లి సత్యం కాదని, అసత్యం అని ఎద్దేవా చేశారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసం నుంచి రైతు ధర్నాకు బయలుదేరుతుండగానే సుంకె రవిశంకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం జలాలు సకాలంలో అందక పంటలు ఎండిపోతున్నాయని దుయ్యబట్టారు. కాళేశ్వరం జలాలను విడుదల చేస్తే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అకసుతోనే సీఎం రేవంత్‌రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జలాశయాల్లో నిండుగా నీరున్నా పంటలకు చుక్క నీరందించని దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారని మండిపడ్డారు. పదేళ్లు నీటి కరువు అన్నదే తెలియని రైతులు ప్రస్తుతం సాగునీరు లేక పంటలు కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటలకు తక్షణమే ఎకరాకు 20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు బాసటగా నిలువాలని హితవుపలికారు. అబద్ధాలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.