గన్నేరువరం, జూలై 8: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కమీషన్ల నారాయణ అని, ఆయన గారడీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. ఆయన క్వారీ కోసం ఊటూరు నుంచి పచ్చునూర్ దాకా రోడ్డు వేసుకొని, గుండ్లపల్లి – గన్నేరువరం డబుల్ రోడ్డుపై, ప్రజల ఆశలపై మాత్రం మన్ను కప్పేందుకు సిద్ధమవుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో గుండ్లపల్లి- గన్నేరువరం డబుల్ రోడ్డుపై రాజకీయం చేసి లబ్ధి పొందిన ఆయన, రోడ్డును ఇంకెప్పుడు..? పూర్తి చేస్తాడని ప్రశ్నించారు.
ఆ రోడ్డును సాధించే దాకా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బేగంపేట, వడ్లూరు, గూడెం, బెజ్జంకివాసులు పోరాటంలో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఈ నెల 12న నిర్వహించనున్న చలో బైక్ ర్యాలీ కార్యక్రమ పోస్టర్ మంగళవారం గన్నేరువరం మండలం ఖాసింపేటలో మండల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమయి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలో కొత్తగా ఏర్పాటైన గన్నేరువరం మండల ప్రజల సౌకర్యార్థం 72 కోట్లతో డబుల్ రోడ్డును మంజూరు చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోడ్డుపై బురద, నీచ రాజకీయాలు చేసి, రోడ్డు సాధన సమితి అని, జేఏసీ అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి గద్దెనెక్కిన కవ్వంపల్లి, ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. ఏడాదిన్నర దాటినా రూపాయి కూడా తేలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్తో మాట్లాడి కరీంనగర్ నుంచి హైదరాబాద్ చేరే లోపే జీవో తయారు చేయించి, నిధులు తెచ్చి అప్పగించామని గుర్తు చేశారు.
తనకు పైసలు ఇప్పిస్తే ఈ రోడ్డు పనులు మొదలు పెడుతానని కాంట్రాక్టర్ వాపోతున్నట్టు చెప్పారు. గతంలో తాను బెజ్జంకి నుంచి బేగంపేటకు సైతం డబుల్ రోడ్డును తెస్తే కంకర పోసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడుతున్నరని భయపడి ఎమ్మెల్యే వెళ్లి కాంట్రాక్టర్ కాళ్లు మొక్కి డాంబర్ వేయకున్నా మట్టి పోస్తే చాలని బతిలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తమకు కావాల్సింది మట్టి రోడ్డు కాదని, డాంబర్ తో స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జనం నోళ్లలో మస్తు మన్ను పోసిండ్రని, ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు మీ మీదనే ప్రజలు మన్ను పోసే పరిస్థితి వచ్చిందని ఘాటుగా విమర్శించారు.