తిమ్మాపూర్, మే 5: బీఆర్ఎస్ వెంటే ప్రజలంతా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చే అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపొవద్దని సూచించారు. ఏ గ్రామానికి పోయినా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే కనిపిస్తున్నదని, కాంగ్రెస్ హయాంలో ప్రగతి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలు ఇప్పటికే మోసపోయి ఆగమవుతున్నారని, మళ్లీ ఆగం కావద్దన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వినోద్కుమార్తోనే అభివృద్ధి చెందిందని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి నిధులు తీసుకువస్తారని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికి తెలియదని, పేదవాడిని అంటున్న బండి సంజయ్ ఇంట్లో రూ.పది లక్షల విలువైన సుసూ అనే చైనా కుక ఎలా ఉందని ప్రశ్నించారు.? బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కరువు గురించి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలకు విసుగొచ్చిందని గుర్తించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్టు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల గౌరవం లేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు ప్రకాశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటి వరకు నోరు విప్పడం లేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి వసూళ్లు తప్ప, అభివృద్ధి విషయంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. క్యాంప్ ఆఫీసులో పాలన.. గుండ్లపల్లిలో వసూళ్ల పర్వం కొనసాగుతున్నదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటు వేసి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. వినోద్‌కుమార్ కోడలు డాక్టర్ హర్షిణి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించి నిధులు తీసుకురావాలంటే వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలన్నారు.
స్మార్ట్ సిటీ, హైవేలను తీసుకువచ్చి కరీంనగర్ పేరును అభివృద్ధి పథాన నిలబెట్టారని పేర్కొన్నారు. వినోద్‌కుమార్‌కు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని, అలాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, జడ్పీటీసీ ఇనుకొండ శైలజ-జితేందర్ రెడ్డి, నాయకులు నాగరాజు, దేవేందర్ రెడ్డి, ఏకానందం, అనిల్, సదిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.