తిమ్మాపూర్,ఆగస్టు20 : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. యూరియా కొరతను నిరసిస్తూ మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో సొసైటీ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం రాజీవ్ రహదారిపై రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
యూరియా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారని, ఉదయం నుంచి రాత్రి వరకు చెప్పులను క్యూ లైన్ లో పెట్టి నిల్చుంటున్నారని, అయినా రైతులకు యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ముందుచూపుతో రైతులకు యూరియా కొరత లేకుండా చూశారని, సాగునీటిని సైతం అందించారని పేర్కొన్నారు.
మళ్లీ గతంలో మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి కొరత, యూరియా కొరత ఏర్పడుతుందని, రైతులు అరిగోస పడుతున్నారని ఆయన అన్నారు.
సొసైటీ చైర్మన్ లను చేర్చుకున్న ఎమ్మెల్యే నారాయణ యూరియాను ఎందుకు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించాలని లేనిపక్షంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ప్రతిరోజు ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, గంప వెంకన్న, పాశం అశోక్ రెడ్డి, సాయిల్ల కొమురయ్య, నాయకులు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.