Putta Madhukar | మంథని రూరల్ 27:ఇరుకు కల్వర్టులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం మంథని ఎమ్మెల్యే కల్వర్టులపై శ్రద్ద చూపని దుస్థితి నెలకొందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి శివారులోని ఇరుకు కల్వర్టును ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం పుట్ట మధూకర్ మీడియాతో మాట్లాడారు. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగిన వాళ్లకు మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృధ్ది చేయాలనే తపన, ఆలోచన ఉంటుందన్నారు.
మంథని ఎమ్మెల్యే గురించి తాము పదేపదే చెప్తున్నామని, ఈ ప్రాంతంపై, ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యేకు ప్రేమలేదని, మన గురించి ఏనాడు ఆలోచన చేయడని పదేపదే చెప్తున్నామని అన్నారు. ఇందుకు అడవిసోమన్‌పల్లి సమీపంలోని ఇరుకైక ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు నిదర్శనమన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో తాము డీఎంఎఫ్టీ నిధులో మంథని కాటారం ప్రధాన రహదారి విస్తరణ, పది మీటర్ల వెడల్పుతో కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు.
కానీ ప్రస్తుతం ఏడు మీటర్ల వెడల్పుతో ఉన్న కల్వర్టులను విస్తరణ చేయాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రహదారి విస్తరణతో వాహనదారులు వేగంగా వస్తున్నారని, కల్వర్టుల సమీపంలోకి రాగానే అవి ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉండే మంథని ఎమ్మెల్యే ఈ ప్రాంత అభివృద్ది గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదో ప్రశ్నించాలన్నారు.
ఆనాడు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంథని నుంచి భట్టుపల్లి వరకు రహదారి విస్తరణ, కల్వర్టుల నిర్మాణం చేశామని, భట్టుపల్లి సమీపంలోని వాగుపై వంతెన నిర్మించి అద్బుతంగా చేశామన్నారు. అలాగే గాడుదుల గండి, ఎర్రగుట్ట వద్ద రోడ్డును వెడల్పు చేయించామని, అప్పటి ఆర్అండ్బీ అధికారి చందూలాల్ స్వయంగా పర్యవేక్షించి పనులు చేయించారని కొనియాడారు. నాయకులు, అధికారులు చిత్తశుద్దితో పని చేస్తే ఎలాంటి అభివృధ్ది జరుగుతుందో చేసి చూపించామన్నారు.
గతంలో ఇరుకు కల్వర్టుతో ఓ కారు ప్రమాదానికి గురైన సంఘటనతోనే తాము ప్రత్యేక చొరవ తీసుకుని కల్వర్టులను వెడల్పు చేయించామన్నారు. అయితే గతంలో ఐదేండ్లు ప్రతిపక్షంలో నేడు అధికారపక్షంలో మంత్రిగా ఉండి ఏనాడు మంథని ఎమ్మెల్యే చిత్తశుద్దితో పనిచేయాలేదన్నారు. తాము అధికారంలో ఉండికూడా ప్రతిపక్ష పాత్ర పోషించామని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లామన్నారు.
అధికారంలో ఉన్నా లేకున్నా తాము సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చినట్లుగా సమాజానికి నాలుగు స్థంభాలైన మీడియా, ప్రజాప్రతినిదులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తేనే సమాజం బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు సైతం ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని, అది మీడియా బాధ్యత అని అన్నారు.