Dasari Manohar Reddy | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 31 : అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంటాల సంకీర్తనను పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆరేపల్లి కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కాంటాల వీరన్న కుమార్తె కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ యశోద దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిమ్స్ లో చేర్పించారు.
కాగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న సంకీర్తనను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంకీర్తనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడినట్లు తెలిపారు. పార్టీ పరంగా కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ యూనిటీ సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి ఉన్నారు.