పెద్దపల్లి కమాన్, జూన్ 9 : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు మతిభ్రమించిందని, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్ని వర్గాలను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ సర్కారు రైతు ప్రభుత్వమని ప్రగల్భాలు పలుకుతూ రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆగ్రహించారు.
ప్రభుత్వ పాలన తీరు మారకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో హరీశ్‌రావు రైతులు, విద్యార్థులు, మహిళలతోపాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు. హరీశ్‌రావుపై ఎమ్మెల్యే విజయరమణారావు చేసిన అనుచిత ఆరోపణలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీనైనా పూర్తి స్థాయిలో అమలు చేసిందా..? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని మండిపడ్డారు. ఐదు నెలలుగా రైతు బీమా పథకానికి ప్రీమియంలు చెల్లించకపోవడంతో ఇటీవల చనిపోయిన రైతుల కుటుంబాలకు బీమా వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల రుణమాఫీ చేశామని సర్కార్ తప్పుడు ప్రకటన చేస్తున్నదని, ఇప్పటీకీ రుణమాఫీ కాక వేల మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
ఎకరానికి రూ.15వేల రైతుబంధు ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతుబంధును ఇవ్వకుండా కోర్టుకెళ్లి ఆపారని.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ జమ చేసిన డబ్బులను ఇచ్చారని దుయ్యబట్టారు. 2024-25 వానకాలంలో పూర్తిగా రైతుబంధు ఎగ్గొట్టిందని, యాసంగిలో మూడు ఎకరాలకు మాత్రమే ఇచ్చారని, 2025-26 వానకాలంలో ఒకసారి రైతుబంధు ఇచ్చిందని, యాసంగిలో రెండు ఎకరాలకు మాత్రమే ఇచ్చారని, మొత్తంగా రెండుసార్లు రైతులకు ఎగనామం పెట్టిందని, చాలా మంది రైతులకు బోనస్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం అతి పెద్ద హ్యాసమని ఎద్దేవా చేశారు.
స్వరాష్ట్రంలో గ్రామగ్రామానా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. కానీ, ప్రస్తుతం కొనుగోళ్లలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు గాస్తున్నారని ఆవేదన చెందారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తగిన గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జీ రఘువీర్‌సింగ్, నాయకులు జూపల్లి సందీప్‌రావు, పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, వంగళ తిరుపతిరెడ్డి, తానిపర్తి మోహన్‌రావు, మర్కు లక్ష్మణ్, వెన్నం రవీందర్, సలేంద్ర రాములు, ముత్యాల రాజయ్య, మొఖిమ్, ఆరెల్లి స్వామి, కుక్క మనోజ్ తదితరులున్నారు.