పెద్దపల్లి, డిసెంబర్3: కాంగ్రెస్ ఏడాది పాలనలో తాము సంతోషంగా లేమని ప్రజలే చెబుతున్నప్పుడు ప్రజాపాలన విజయోత్సవాల సంబురాలెందుకు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ఈ సమయంలో రైతులు, విద్యార్థులు, ఆడబిడ్డలు, వృద్ధులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, సీఎం ఎన్ని సభలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు గుప్పించిందని, ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలోనే పెద్దపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులకే కొత్తగా శంకుస్థాపన చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం పెద్దపల్లికి రేవంత్‌రెడ్డి వస్తున్నారని, జిల్లా అభివృద్ధికి ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
గని కార్మికుల హామీలు అమలు చేయండి
గోదావరిఖని, డిసెంబర్ 3: సింగరేణి గని కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు, సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు 240 గజాల భూమి, కొత్త బావులకు అనుమతులు, ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని చెప్పాయని, కానీ ఇప్పటివరకు ఏ సమస్యపైనా స్పష్టత లేదన్నారు. కార్మికుల పెరుక్స్పై ఆదాయపు పన్ను, సింగరేణి ఏరియాలో సూపర్ స్పెషాలిటీ దవాఖానగా మార్పు, కొత్త క్వార్టర్ల నిర్మాణంపై ఇచ్చిన హామీలపై కదలిక లేదన్నారు. అలాగే, మహిళలకు గౌరవప్రదమైన ఉద్యోగం ఇస్తామని చెప్పిన దానికి విరుద్ధంగా వారిని అన్ని పనులకు పంపేలా యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. సీఎం పర్యటన సభలో ఈ హామీలపై ప్రకటన చేయాలని కోరారు. సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, నూనె కొమురయ్య, వడ్డెపల్లి శంకర్, చెల్పూరి సతీశ్, ఇందూరు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు, మాసాడి సాయిచరణ్, రాజు పాల్గొన్నారు.