మెట్పల్లి/కోరుట్ల, నవంబర్ 12: కాంగ్రెస్ అంటేనే మోసమని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన పాదయాత్రను మంగళవారం కోరుట్లలో జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, ఏడాది అవుతున్నా పూర్తి స్థాయిలో చేయలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతదా? అని ప్రశ్నలు వస్తే ‘నాకేమైనా తెలివి లేదా..? మెంటలెక్కిందా..? బంద్ చేయడానికి’ అని ఆనాడు మాట్లాడిన రేవంత్‌రెడ్డి గడిచిన రెండు పంటల సీజన్లకు ఎందుకు రైతు బంధు ఇవ్వలేదో చెప్పాలన్నారు.
వరికి బోనస్ అడుగుతారనే భయంతో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఏర్పాటు చేశారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు యువకుడు, ఉత్సాహవంతుడైన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ రైతు లు, ప్రజల పక్షాన నిలబడి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పాదయాత్రకు వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలిరావడం, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, రైతుల కోసం తాను ఎప్పుడైతే పాదయాత్ర చేస్తానని ప్రకటించానో అప్పటి నుంచి తమ కోసం పాదయాత్ర చేయాలని వేలాదిగా వివిధ వర్గాల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో వందలాది పాదయాత్రలు చేస్తానని, ప్రజల ముందు ప్రభుత్వాన్ని నిలబెడతానన్నారు.