కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కార్పొరేషన్ : బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బీసీలను మేలు కొల్పేందుకు, కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకే కరీంనగర్లో ఈ నెల 14న బీసీ కదనభేరీ పేరుతో శంఖారావం పూరించబోతున్నామని చెప్పారు.
ఈ సభకు బీసీలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని జ్యోతిబాఫూలే మైదానం (సర్కస్ గ్రౌండ్)లో నిర్వహించే సభా స్థలాన్ని బీఆర్ఎస్ బీసీ ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, ఎల్ రమణతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కరీంనగర్ శివారు చింతకుంటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమై సభా ఏర్పాట్లు, బీసీల తరలింపుపై చర్చించారు.
ఆ తర్వాత మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసపూరితమైన హామీలిచ్చి, బీసీ సమాజాన్ని నమ్మించి గొంతు కోసిందని మండిపడ్డారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘మేమేమైనా (బీసీలు) భిక్షగాళ్లం అనుకుంటున్నారా’ అంటూ మండిపడ్డారు.
బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తే సరిపోవని, విద్య, ఉద్యోగ రంగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో చర్చకు వచ్చిన తర్వాత తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినపుడే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పడానికి, బీసీల రిజర్వేషన్లకు సహకరించడం లేదని ప్రధాని మోదీని, కేసీఆర్‌ను తిట్టడానికే రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు నిరంతర పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 14న నిర్వహించే బీసీ కదనభేరీకి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి బీసీ బిడ్డలు, బీసీ సంఘాలు, బీఆర్ఎస్ శ్రేణులు, బీసీ ప్రొఫెసర్లు, మేధావులందరినీ ఆహ్వానిస్తున్నామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలైన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
పార్లమెంట్లో చట్టం రాకుండా, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా ఎన్నిలకుపోతే మాత్రం కర్రుకాల్చి వాత పెట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్రపతి, ప్రధానిని కలవక ముందే ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆది నుంచీ బీసీలకు వ్యతిరేకమేనని, స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా బీసీలపై వివక్షతో ఉందన్నారు.
ఈ మీడియా సమావేశంలో మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, దావ వసంత, పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు బండ శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్, ఏనుగు రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష
బీసీలకు బీఆర్ఎస్ ఒక్కటే శ్రీరామ రక్ష. కుల గణన పేరుతో కాంగ్రెస్ బీసీలను తక్కువ చేసి చూపి తీవ్రంగా అవమానించింది. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలొక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కేవలం రాజకీయంగానే కాకుండా విద్య, ఉద్యోగావకాశాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు సబ్ ప్లాన్ ఇస్తామని, గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పింది. కానీ, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేక పోయింది.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
బీసీలపై చిత్తశుద్ధి ఎక్కడున్నది?
ఢిల్లీలో ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగిన డ్రామాలను రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలి. అక్కడ ధర్నా చేసి ఏం సాధించారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలి. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ ఎవరి ద్వారా అడిగారో బహిర్గతం చేయాలి. రాహుల్ గాంధీతోపాటు వంద మంది కాంగ్రెస్ ఎంపీలు వెళ్లి అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వరా..? రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ఖర్గే కూడా రాలేదు. ఇక బీసీలపై కాంగ్రెస్‌కు చిత్త శుద్ధి ఎక్కడున్నది? వంద మంది ఎంపీల్లో ఒక్కరు కూడా రిజర్వేషన్ల గురించి ప్రశ్నించలేదు. ఇక కాంగ్రెస్‌కు బీసీ వర్గాలపై ఏపాటి చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతున్నది. ఇదంతా మొక్కుబడి ప్రయత్నమే. కామారెడ్డి డిక్లరేషన్ కచ్చితంగా అమలు చేయాలి.
– గంగుల కమలాకర్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి
కాంగ్రెస్ డ్రామాలు
అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కి బీసీల గొంతు కోసింది. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నది. బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడుతున్నది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక, మభ్యపెట్టే ఆలోచనలు చేస్తున్నది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తమిళనాడు తరహాలో కొట్లాడాలి. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి. అదే ఏకైక మార్గం. రేవంత్‌రెడ్డి చర్యలన్నీ బీసీల గొంతు కోసే విధంగా, బీసీలను శాశ్వతంగా రెండో శ్రేణి ప్రజలుగా ఉంచే విధంగా ఉన్నాయి. తెలంగాణ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా గర్జించే కేసీఆర్ ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు కంకణబద్ధులై ఉన్నారు.
– సిరికొండ మధుసూదనాచారి, మండలి ప్రతిపక్ష నేత