ధర్మపురి, ఫిబ్రవరి 9: అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, నమ్ముకున్న ప్రజలను నిండా ముంచిందని రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి చేసింది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని, దుష్టపాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సోమవారం ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి ఉండదన్నారు. రైతులకు, ప్రజలకు పేగుబంధంలా ఉన్న కేసీఆర్‌ను దూరం చేసేందుకు 420 హామీలిచ్చి మోసం చేసిందని ఈ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాల్లో కోతపెడుతున్నారే తప్ప, కొత్తవి ఏమైనా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలని చెప్పి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లు ఏం సాధించారని ఓట్లు అడుగుతున్నారో జనం నిలదీయాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టంగట్టాలని, కారు గుర్తు ఓటేయాలని కోరారు. ఆయన వెంట డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ డా శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు అయ్యోరి రాజేశ్‌కుమార్, మహేశ్, అభ్యర్థులు ఎల్లాల వెన్నెల, సంగి సత్తెమ్మ, సంగి రేఖ, ఓడ్నాల ఉమాలక్ష్మి, అనంతుల విజయలక్ష్మి, తిర్మందాసు అనూష, బండారి రంజిత్, పెరుమాండ్ల ఎల్లాగౌడ్, చుక్క విజయ, బాకి చంద్రశేఖర్, మద్వాచారి కపిల్, నక్క రామక్క, జెట్టి విజయలక్ష్మి, మామిడి శివసాయి, గుర్రాల సుధాకర్ ఉన్నారు.