జగిత్యాల, ఫిబ్రవరి 25 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, జాబ్ క్యాలెండర్‌ను ఎందుకు విడుదల చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఎందుకు గెలిపించాలని నిలదీశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి పదిహేను నెలలు గడిచిందని గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అనుమతి పత్రాలను అందించి, అవి వారే ఇచ్చినట్టు కాంగ్రెస్ చెప్పుకుంటున్నదని మండిపడ్డారు.
ఇంతకంటే మోసం, దగా ఉంటుందా? అని గ్రాడ్యుయేట్స్ పక్షాన, బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పింనందుకా..? డబ్బులున్న అభ్యర్థులను పెట్టినందుకా..? ఎందుకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సభకు ఒక సీఎం వచ్చి ఓటు వేయాలని కోరిన చరిత్ర గతంలో లేదని ఎద్దేవా చేశారు. మంత్రులంతా ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా ఫీల్ అవుతున్నారని, కాంగ్రెస్, బీజేపీని నమ్ముకున్న అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకే హవా ఉందని, ఈ ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్‌కు చెంప పెట్టులాగా ఉంటాయన్నారు. బీజేపీతో తమకు సంబంధం లేదని, తమది స్వయం ప్రతిపత్తిని కలిగిన పార్టీ అని, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత, వైస్ చైర్మన్ ఒద్దినేని హరి చరణ్‌రావు, తదితరులున్నారు.