కరీంనగర్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ) : కలిసి కట్టుగా పోరాడి మళ్లీ కేసీఆర్ పాలన తెచ్చుకుందామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆదివారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్స్‌లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల అలయ్.. బలయ్ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్లో 2001 నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని, అప్పటి ఉత్సాహం, ఆనాటి స్ఫూర్తి కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజలను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. గతేడాది డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, 13 హామీలు నెరవేర్చుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 300 రోజులకు చేరినా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేక పోయిందని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినా.. కష్టం వచ్చినా సమయానికి 11 విడుతల్లో రూ.72 వేల కోట్లు రైతుబంధు ఇచ్చామని, ఒక్కసారికే రేవంత్‌రెడ్డికి ఎట్లా ముక్కులకు వస్తుందని ప్రశ్నించారు. అంటే రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేకి అనేది స్పష్టంగా తేటతెల్లమైందని స్పష్టం చేశారు. రైతులను శక్తి ఏంటో చూపిస్తేనే రైతు భరోసా ఇస్తారని సూచించారు. మహిళలకు రూ.2,500 చొప్పున పది నెలల పాలనలో ప్రతి మహిళకు కాంగ్రెస్ సర్కారు రూ.25 వేలు బాకీ పడిందని, ఈ విషయాన్ని ప్రతి మహిళకు చెప్పాలన్నారు. బతుకమ్మ పండుగకు రెండు చీరెలు ఇస్తామని చెప్పి ఉన్న చీర ఎగబెట్టారని మహిళలే అంటున్నారని, వారి కోసం చేసిన ఒక్క బస్సు తప్ప అంతా తుస్సేనని, ఆ బస్సు కూడా ఆగమాగమే ఉందన్నారు.
ఆసరా పింఛన్లు రూ.4 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి పది నెలల పాలనలో రెండు నెలల పింఛన్లు ఎగవేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, కరెంట్ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నా దిక్కులేని పరిస్థితి నెలకొన్నదన్నారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పి బీఆర్ఎస్ నిలదీయగానే వాయిదాలు వేస్తూ వస్తున్నారని, మానకొండూర్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరికి వచ్చి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని నిరూపించే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా? అని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటున్నారని, అది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితేనే వర్తిస్తుందని చెబుతున్నారని, మిల్లర్లే రైతుల వద్దకు వెళ్లి రూ.3 వేలకు క్వింటాల్ చొప్పున సన్న వడ్లు కొంటుంటే బోనస్ ఎందుకుని, ఇది కూడా రైతులకు వర్తించని పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. రూ.93 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని, ఇప్పుడు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు వెచ్చించడంలో మర్మం ఏంటో ప్రజలు తెలుసుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 38 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చామని, మూసీ నది సుందరీకరణతో ఎవరికి లాభమని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పైసలు లేవని అంటున్న ప్రభుత్వానికి మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీకి గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై అన్ని వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, కార్యకర్తలు వారి ముందు నిలిచి కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. పోలీసులు అతిగా ప్రవర్తించవద్దని, రేవంత్‌రెడ్డి పర్మినెంట్ కాదని, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే ఆంధ్రప్రదేశ్లోలాగా రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దసరా పండుగ అంటే ఆనాడు పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీది నుంచి కిందికి దించారని.. ఈ రోజు రసమయి బాలకిషన్ కూడా ధూం ధాం.. అలయ్ బలయ్ పేరిట తన పాట అనే ఆయుధంతో కాంగ్రెస్‌పై పోరాటానికి సిద్ధవుతున్నాడని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రం మొత్తంలో ధూంధాం పెట్టి 25 ఏండ్లు అవుతున్నదని. ఆనాడు ఆ కార్యక్రమం తెలంగాణ ప్రజల్ని ఒకటి చేసిందని, తన పాట, మాటలతో కళాకారులందరు తెలంగాణ కోసం ప్రజల్ని సమాయత్తం చేశారని గుర్తు చేశారు. మరోసారి కాంగ్రెస్ నాయకుల మెడలు వంచేందుకు రసమయి మరోసారి పోరాట గళాన్ని వినిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్, గడ్డం నాగరాజు, ఇనుకొండ జితేందర్‌రెడ్డి, సిద్ధం వేణు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఓటములు కొత్త కాదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటేనే రెండు సార్లు ప్రభుత్వంలోకి వచ్చాం. పది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి వచ్చింది. అదృష్టవశాత్తు వర్షాలు సమృద్ధిగా కురిశాయి. లేకపోతే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితే ఉండేది కాదు. ఆనాడు వైఎస్సార్ వంటివారినే తట్టుకుని కేసీఆర్ బీఆర్ఎస్ను నడిపించారు. ఇప్పుడున్న వారు పెద్ద లెక్క కాదు. ఎన్నో ఏండ్ల కష్టంతో రాష్ట్ర ఏర్పాటుతోపాటు అధికారం సాధ్యమైంది. నేను యువకుడిగా ఉన్నప్పుడే.. నాడు బలమైన శక్తిగా ఉన్న ప్రస్తుత మంత్రి కొండా సురేఖపై కేసీఆర్ నన్ను ఎంపీగా పోటీలోఉంచారు. ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ వస్తాయి. ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం.
మానకొండూర్ నియోజకవర్గంలో వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. దందాలపై సోషల్‌మీడియాలో పోస్టులు పెడితే మన్నెంపల్లికి చెందిన సదిగౌడ్ అనే యువకుడిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. నియోజకవర్గంలో ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. అయినా, ఏ ఒక్క కార్యకర్త భయపడడు.మనందరికీ హరీశన్న అండగా ఉంటారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి కాదు.. కమీషన్ల సత్యనారాయణ. ఇప్పటికే రూ.వంద కోట్ల వసూళ్లు పూర్తి చేశారు. ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తారో. అబద్ధ్దాన్ని ప్రశ్నించాలి. నిజాన్ని బతికించుకోవాలి. రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని పదవులు మనవే. పది నెలల్లో ఒక్క శిలాఫలకం పెట్టలేదు. తిమ్మాపూర్ యాదవుల పల్లిలో పెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ కుంటలో కడుతున్నారు. హైదరాబాద్‌లో హైడ్రాతో భయపెడుతున్న ప్రభుత్వం.. ఇక్కడ కుంటలో స్కూల్ ఎట్ల కడుతున్నది. నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఎలాంటి తగాదాల జోలికి వెళ్లవద్దు. నేను వారంలో నాలుగు రోజులు ఇక్కడే ఉంటా. ఏ సమస్య వచ్చినా మీవెంట నేనున్నా.