Mallojula | పెద్దపల్లి కమాన్, మార్చి 1: మావోయిస్టు పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి ఆదివారం చేరుకున్నారు. 44 ఏళ్ల పాటు సాయుధ పోరాటం జీవితం గడిపిన మల్లోజుల ఇటీవల తన భార్య తారతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి మల్లోజులకు మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తున్నది. మల్లోజుల సోదరుడు మల్లోజుల అంజన్న ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.
దీంతో అన్నను పరామర్శించేందుకు మల్లోజుల పెద్దపల్లికి వచ్చారు. చాలా కాలం తర్వాత పెద్దపల్లికి వచ్చిన మల్లోజులను కలిసేందుకు పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. కొంతసేపు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అందరితో కలిసి ఫోటోలు దిగారు. అయితే మల్లోజుల పర్యటనకు పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. మల్లోజుల వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసు బృందం అక్కడి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచింది. అయితే మల్లోజుల వేణుగోపాల్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.