హైదరాబాద్, మార్చి 21 : మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదాన్ని కారణమైన ఘటనలో కరీంనగర్ మాజీ మేయర్ కుమారుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ నేత వై సునీల్ రావు కుమారుడు వై ప్రద్యుమ్న్ (20) అల్వాల్ సమీపంలోని సిటిజన్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
బుధవారం తెల్లవారుజామున తన స్నేహితులు యశ్వంత్ రెడ్డి, కార్తీక్ రాజ్‌తో కలిసి శంకర్పల్లి నుంచి జూబ్లీహిల్స్ మీదుగా కారులో వెళ్తున్నారు. ప్రద్యుమ్న్ కారు నడుపుతుండగా యశ్వంత్ పక్క సీట్లో కూర్చున్నాడు. అప్పటికే మద్యం తాగిన ప్రద్యుమ్న్ మితిమీరిన వేగంతో కారు నడిపిస్తూ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సమీపంలో రాగానే అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టింది.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని కారులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా కారు నడిపిస్తున్న ప్రద్యుమ్న్ మద్యం తాగినట్టు తేలింది. మద్యం మత్తులో కారును నడిపిన ప్రద్యుమ్న్తో పాటు మిగిలిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు.