జగిత్యాలటౌన్/ సారంగాపూర్, డిసెంబర్ 11: ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల నిర్వహణను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. బుధవారం ఉదయం సారంగాపూర్ కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిది మంది విద్యార్థినులు అస్వస్థత చెందగా, అందులో ముగ్గురిని స్థానిక దవాఖానకు, మరో ఆరుగురిని జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో సాయంత్రం ఇండ్లకు పంపించారు. అంతకుముందు దావ వసంత జగిత్యాల దవాఖానకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వరుస ఘటనలు జరుగుతన్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంక్షేమ పాఠశాలలను సందర్శించి పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ సర్కారు పేదల కోసం మాతా శిశు దవాఖాన కడితే, ఈ ప్రభుత్వం కాలం చెల్లిన మందులు ఇస్తూ మరింత అనారోగ్యం పాలయ్యేలా చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, కౌన్సిలర్ దేవేందర్ నాయక్, నాయకులు సాగి సత్యం రావు, చింత గంగాధర్, నారాయణ రావు, రైజ్వన్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.