కార్పొరేషన్, జూన్ 22: నగరపాలక సంస్థ అవినీతిమయమైందని పదేపదే ఆరోపించడం కాదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణకు సిట్ ఏర్పాటుతో పాటు పాలక వర్గాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాయాలన్నారు.
కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూను స్వాగతిస్తున్నామని, కానీ అందులో ఆయన చాలా విషయాలను మరిచి పోయారని విమర్శించారు. స్మార్ట్‌సిటీ డెవలప్మెంట్లో భాగంగా వన్‌టౌన్ ఎదుట తొలగించిన తెలంగాణ తల్లి, మాజీ ఎంపీ చొక్కారావు విగ్రహాలను నేటికీ ఏర్పాటు చేయలేదని చెప్పారు.
ఈ విగ్రహాల ఏర్పాటు విషయంలో అధికారులు మంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తొలగించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టారో ఇప్పటి దొరకడం లేదన్నారు. ఇటీవల సమీక్షలో చొక్కారావు విగ్రహం ఒక్కటే అక్కడ పెట్టాలని మంత్రి చెప్పినట్టు తాము విన్నామన్నారు. ఈ చౌరస్తాలో చొక్కారావు విగ్రహంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమకారులందరం కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా బొమ్మకల్ జంక్షన్ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న మున్సిపల్ అధికారులు, కమిషనర్, కన్సల్టెన్సీ ఎండీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
నగరపాలక సంస్థలో లేని బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో స్మార్ట్‌సిటీ నిధులు చట్టవిరుద్ధంగా ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి జరిగిందని ఎంపీ బండి సంజయ్ గతంలోనే కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారని, మరి మేయర్ ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదన్నారు. స్మార్ట్‌సిటీ తేవడంలో సంజయ్ పాత్ర ఏమాత్రం లేదని, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కృషి వల్లే వచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు జక్కం నర్సయ్య, పెండ్యాల మహేశ్‌కుమార్, గుంజపడుగు హరిప్రసాద్, రాములు, కెమసారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.