కార్పొరేషన్, మే 1: ‘పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డికి ఓటమి భయంపట్టుకున్నది. తక్కువ సీట్లు వస్తాయని ఆందోళనతో ఎలాగైనా గెలవాలని అది చేస్తాం.. ఇది చేస్తామని రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నడు. ప్రచార సభల్లో దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ ఓట్లు అడగడం ఎన్నికల నిబంధనలను అత్రికమించడమే అవుతుంది. రేవంత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం అయిన తర్వాత తొలిసారి ఈ ప్రాంతానికి వచ్చిన రేవంత్‌రెడ్డి కరీంనగర్ జిల్లాకు గాడిద గుడ్డు తీసుకువచ్చాడా..? అని ప్రశ్నించారు.
సీఎం హోదాలో గాడిద గుడ్డును ప్రదర్శించడం దేనికి నిదర్శనమని విమర్శించారు. ఎవరినీ అవమానించేందుకు సీఎం అలా ప్రవర్తిస్తున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటేనని విమర్శించారు. కరీంనగర్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మూడు సార్లు పోటీ చేసిన జగపతిరావు కొడుక్కు ఇప్పుడు అదే పార్టీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. అలాగే మల్కాజ్‌గిరిలో బీజేపీకి లాభం చేసేందుకు అంతగా పట్టులేని అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టిందని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా ఉండేలా కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఇక్కడే కాదు రాష్ట్రంలోని పలు స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడించాలన్న కుట్రలతో బీజేపీ, కాంగ్రెస్‌లు కుయుక్తులు పన్నుతున్నాయని దుయ్యబట్టారు. వెలిచాల రాజేందర్రావు ఎప్పుడైనా కరీంనగర్లో కనిపించాడా..? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రావడం డబ్బులు వెదజల్లడం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ సారి తెలంగాణలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. అందుకే రేవంత్‌రెడ్డి ఎక్కడికిపోయినా అక్కడి దేవుళ్లపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారని, ఆయన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోకపోతే తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు.