ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, కాటకాలు కనిపించేవి. ఉమ్మడి జిల్లాలోనూ అవే పరిస్థితులుండేవి. ప్రధానంగా చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణంగా ఉండేది. ఏటా ఆశించిన వర్షాలు లేక వాగులు, వంకలు ఎండిపోయి కనిపించేవి. చెరువులు, కుంటలన్నీ తుమ్మలు, ముళ్లపొదలతో దర్శనమిచ్చేవి. వానలపై ఆధారపడి వేసిన పంటలు మధ్యలోనే ఎండిపోయేవి. నీళ్లు అందక పొలాలు నెర్రెలువారేవి. ఎందరో రైతులకు ఆత్మహత్యలే దిక్కయ్యేవి. పనుల్లేక మరెంతోమంది ఉపాధి కోసం పొట్టచేతబట్టుకొని వలసలు పోయేది. ఇటు గుక్కెడు నీటి కోసమూ తండ్లాడేది. మారుమూల ప్రాంతాల్లోనైతే కిలోమీటర్ల కొద్దీ నడిచేది.
నీళ్లు పుష్కలం.. పనులు పుష్కలం
తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అపరభగీరథుడు కేసీఆర్ అడవుల పరిరక్షణతోపాటు జలసంరక్షణకు తీసుకున్న చర్యలతో వానలు దండిగా పడుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులతో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా కాలంతో సంబంధం లేకుండా చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతుండగా, భూగర్భ జలాలు పైపైకి ఉప్పొంగుతున్నాయి. నాటి దుర్భిక్ష పరిస్థితులు పోయి మెట్టప్రాంతాల్లోనూ జలసవ్వడులు వినిపిస్తున్నాయి.
నాడు బీడుగా ఉన్న భూముల్లోనూ బంగారం లాంటి పంటలు పండుతుండగా, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో కరువన్నదే లేకుండా పోగా, ఒకప్పుడు పని కోసం ఇక్కడి నుంచి వలస పోయినా.. ఇప్పుడు అదే పని కోసం ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. చేతినిండా పనిదొరుకుతుండడంతో నిశ్చింతగా బతుకులు వెల్లదీస్తున్నారు.
కరీంనగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కరువు, కటకాలు తాండవించేవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉన్న ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఏటా యాసంగి పంటలకు మాత్రమే నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. అది కూడా ఆయకట్టు ప్రాంతానికే పరిమితమయ్యేది. మిగతా మండలాలన్నీ కరువుతో అల్లాడేవి. భూగర్భ జలాలపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేసే వారు. పునాస పంటలకు వానలే దిక్కయ్యేవి. వానలు కురిస్తే పండటం.. లేదంటే ఎండిపోవడం సర్వ సాధారణంగా కనిపించేవి. భూగర్భ జలాలు అడుగంటి వేసిన వరి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి కనిపించేది.
ఆశించిన వానలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తేనే ఆయకట్టులో పచ్చదనం కనిపించేది. లేదంటే బీడు పడిన భూములే దర్శనమిచ్చేవి. వాగుల్లో చూద్దామన్నా నీటి చుక్క కనిపించేది కాదు. చెరువులు, కుంటల పరిస్థితి చెప్పనక్కర లేదు. సరైన వానలు లేక చెరువులు, కుంటలు ఎక్కడ చూసినా ఎండి పోయి కనిపించేవి. వీటి నిండా తుమ్మలు, ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు అల్లుకుని కనిపించేవి. ఫలితంగా పంటలు లేక రైతులు అష్ట కష్టాలు పడేవారు. అప్పులు చేసి బతికాల్సిన పరిస్థితి కొందరిదైతే ఇతర వృత్తుల్లోకి వెళ్లి బతుకెళ్లదీసుకున్న వారు ఎందరో కనిపించే వారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాలు, దేశాలకు వలసలు వెళ్లేవాళ్లు.
పస్తులుండే రోజులు పోయినయ్..
తెలంగాణ రాకముందు చెరువులు ఎండిపోయి, బోర్లు ఇంకిపోయి నీళ్లు లేక పంటలు ఎండిపోయేవి. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. గుక్కెడు నీటి కోసం తెగ తండ్లాడేది. ఆనకాలంల దుక్కులు దున్నెటందుకు మొగులు దిక్కు ఎదురుజూసేది. చూసీ చూసీ కండ్లల్ల నీళ్లు తిరిగేది. సావుకారి దగ్గరికి పోయి అడ్డికి పావుసేరు తెచ్చి బాయిలు తవ్విత్తె అంతంతే నీళ్లు పడేది. ఈ నీటిని నమ్ముకొని పంటేత్తె కోతకు అచ్చె టైంకు నీరందక ఎండిపోయేది.
తెచ్చిన అప్పులు దీరక, కూలి పని దొరుకక ఎందరో ఉన్న భూములు అమ్ముకున్నరు. కొందరు పట్టణాలకు ఎల్లిపోయి ఏ హోటళ్లనో పనిచేసి బతికిన్రు. అయినోళ్లను ఇడిసిపెట్టి కానరానికాడికి పోయి నానాబాధలు పడ్డరు. కేసీఆర్ సార్ పుణ్యమా అని మన తెలంగాణ మనకచ్చింది. ఎక్కన్నో ఎత్తుమీద ఉన్న నీళ్లను దెచ్చి మా భూములను తడుపుతండు. కాళేశ్వరం జూసేందుకు మమ్మల్ని బస్సులు వెట్టి తీసుకపోయిండ్రు. గా ప్రాజెక్టు జూసినంక కండ్లు బైర్లుగమ్మినయి. అంత గొప్ప ధైర్యం జేసి నీళ్లుదెత్తెనే ఇప్పుడు సాగుకు, తాగడానికి ఢోకా ఉంటలేదు. ఒక్క గుంట భూమి గూడా ఖాళీగా లేకుంట సాగుజేత్తన్రు. నాకున్న ఎకురం భూమి, ఇంకో ఎకురం కౌలుకు దీసుకొని ఎవుసం జేత్తన్న.
పంట పెట్టుబడి, 24 గంటల కరెంట్, పుష్కలమైన నీళ్లున్నయి. కేసీఆర్ పాలన పుణ్యమో ఏమో గానీ వానలు మస్తువడుతన్నయి. ఎండల్ల కూడా బాయిల నీళ్లు అట్లనే ఉంటన్నయి. కరెంట్ కోసం, కాల్వ నీళ్ల కోసం ఎదిరిజూసే బాధలేదు. పంటలు ఏసినమంటే పిండి(ఎరువులు)జల్లుడు, రోగం అత్తె మందు గొట్టడానికే పొలంకాడికి పోతన్న. మిగిలిన టైంల వేరేటోళ్లకు ఎవుసం పనులు, ఉపాధి పనులకు పోతన్న. పస్తులుండే రోజులు పోయినయ్. చేతినిండా పని.. జేబునిండా పైసలుండే రోజులు వచ్చినయ్. తెలంగాణ అత్తె ఏమత్తది అన్నోళ్లకు రైతుల సంతోషంజూస్తే సమజైతది. రైతును రాజును జేసింది కేసీఆర్ సారే. ఆయనే మళ్లా సీఎంగావాలె.
– దాసారపు ఓదెలు, రైతు, వీణవంక
పుష్కలంగా జలాలు
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆశించిన వర్షాలు కురుస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా కరువు నేలపై అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వానలు కురువాలంటే మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు సానుకూలంగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, సంరక్షించడం సామాజిక బాధ్యతగా గుర్తించడంతో గడిచిన తొమ్మిదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీ శాతం పెరిగింది. ఫలితంగా ఇప్పుడు ప్రతి ఏటా వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి.
సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల కారణంగా కురిసిన ప్రతి వాన చినుకు రైతుల చేళ్లలోకి మళ్లుతోంది. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు చెక్‌డ్యాంలు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టడంతో ఒకప్పటి కరువు సీమలో ఇప్పుడు సిరిసంపదలు తులతూగుతున్నాయి. ఒక విజనరీతో కరువు శాశ్వతంగా దూరం కావడంతో వ్యవసాయం ఇప్పుడు పండుగలా మారింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది.
వర్షాలు పుష్కలంగా కురవడం, ప్రాజెక్టులు ఏటా నిండడం, చెరువులు, కుంటల్లోకి నీటిని మళ్లించడం, నిండు వేసవిలోనూ మత్తళ్లు దుంకడం వంటి శుభ పరిణామాలు ఏటా కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో భూగర్భ జలాలు పెరగడం, 24 గంటల ఉచిత విద్యుత్తుతో రైతులు పుష్కలంగా పంటలు పండించడం, గతానికి ఇప్పటికి పోల్చి చూస్తే అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకే కాకుండా ఇతర వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగయ్యాయి.
రెండు ట్రాక్టర్లకు ఓనరైండు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏరుకొండ అనిల్. ఇతడిది హుజూరాబాద్ పట్టణ పరిధిలోని ఇప్పల్‌నర్సింగాపూర్..ఆరేండ్ల కిందట బతుకుదెరువు కోసం అప్పు చేసి ట్రాక్టర్ కొనుకున్నడు. అప్పుడు పెద్దగా గిరాకీ లేకపోవడంతో మస్తు మధనపడ్డడు. అప్పుడు ఫైనాన్స్ కిస్తీలు గూడా ఎల్లకపోయేది. ఈ పరిస్థితుల్లో వర్షాలు బాగా పడడం.. కాళేశ్వర జలాలు కాలువల్లో పుష్కలంగా పారడంతో దున్నుకాళ్లకు గిరాకీ పెరిగింది. మొదట్లో బలిమిటీకి 30 ఎకరాలు దున్నిన అనిల్ మెలమెల్లగా యేడాది క్రితం వరకు 60 ఎకరాలకు పెరిగింది.
ఇంకా దున్నుళ్లకు గిరాకీ వస్తుండడంతో ఎనిమిది నెలల క్రితం మరో కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేసిండు. గడిచిన సీజన్లో అతను మడికట్టు 90 ఎకరాలు, ఎలికట్టు, రోటవేటర్ కలిపి 20 ఎకరాలు దున్నాడు. మడికట్టు(వరి)కు ఎకరానికి రూ. 6వేలు, ఎలికట్టు(పొసిదుక్కి) రోటవేటర్‌కు ఎకరానికి రూ.2వేలు తీసుకుంటున్నాడు. మొత్తంగా రెండు ట్రాక్టర్లకు కలిపి ఖర్చులు పోను పసలుకు రూ. 2లక్షల 50వేలు వరకు మిగులుతుందని , మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నానని చెప్పిండు. తెలంగాణ అచ్చినంకనే నాలాంటి ఎందరో బాగుపడ్డారని సంతోషం వ్యక్తం చేశాడు. ఇదంతా కేసీఆర్ సర్కారు పుణ్యమేనని చెబుతున్నాడు.
– హుజూరాబాద్, సెప్టెంబర్ 23
ఏడాదంతా ఎవుసం పనులే..
తెలంగాణ రాక ముందు ఎవుసంజేస్తే పురుగుల మందు తాగి సచ్చుడే అనేటోళ్లం. అప్పుటి ప్రభుత్వాలు రైతులను పట్టించుకోక పోయేవి.. ఇటు కరెంట్ సక్కగ ఉండకపోయేది.. నీళ్లు రాకపోయేది. ఇట్ల రైతులు నానా తంటాలు పడేటోళ్లు. ఇలాంటి పరిస్థితిల రైతులు ఎవుసం చేయడానికి ముందుకు రాకపోయేది. దీంతో మాలాంటి కూలీలకు పని దొరుకుడే కష్టమయ్యేది. కూలి పనులు లేక, ఏంజేయాల్నో తెల్వక కుటుంబాలను సాదుకోవడం శానా కష్టమయ్యేది.
తెలంగాణ రాష్ట్రం రావడం.. కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కావడం నిజంగా ఇక్కడోళ్ల అదృష్టమే.. రైతుల కష్టాలను చూసిన కేసీఆర్ సారు పంటలకు నీళ్లు ఇస్తున్నడు. ఫుల్లుగా కరెంట్ ఇస్తున్నడు. పెట్టుబడి కోసం ఎవరిదగ్గరికో అప్పులకు పోయి నష్టపోవద్దని ఏడాదికి రెండు సార్లు రైతు బంధు పథకం కింద సాయం చేస్తున్నడు. దీంతో ఎవుసం అంటే దండుగ అన్నోళ్లు ఇప్పుడు ఎంతో సంతోషంగ పండుగలెక్క సాగు చేసుకుంటున్నరు. ఊళ్లె ఎవుసం బాగా పెరిగి నాలాంటి పేదలకు ఏడాదంతా పనులు చేయడానికి కూలీ దొరుకుతంది.
గిప్పుడు పడావు భూములన్నీ సాగైతన్నయ్. గందుకే మాకు కూడా చేతి నిండా కూలీ దొరుకుతంది. ఎవుసం పనులు మొదలు ధాన్యం ఇంటికి చేరేదాక కూలీ ఉంటంది. ఒడ్లు పెట్టుడు, నాట్లేసుడు, కలుపు తీసుడు, పొలాల్లో మందులు చల్లుడు.. గిట్లా ఏడాది పొడుగూతా ఏదో ఒక పని దొరుకుతంది. గతంల ఇక్కడ పనులు లేక ఇక్కడోళ్లు వేరే దేశాలు, రాష్ర్టాలకు పోయేది. కానీ, గిప్పుడు మనకాడికే వాళ్లు వత్తన్రు. అంతా కేసీఆర్ దయనే..
– దీకొండ ఉప్పలయ్య, కూలీ, కొలనూర్ (ఓదెల)
పనికి రంది లేకుండా ఉంది..
నేను నాడు పొలం పనులు లేక.. పంటకు నీళ్లు లేకపోవడంతో ట్రాక్టర్లకు గిరాకీ లేకపోతుండె. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ నీళ్లు తెచ్చిండు. ఏ చెరువుల, కుంటలల్ల చూసినా అన్నీ నీళ్లే ఉన్నాయి. వరి పొలాలు ఎక్కువగా అయినయి. రాళ్లు, రప్పలు ఉన్న భూములను సైతం అచ్చు కట్టించుకొని ఎవుసం చేస్తున్నరు. ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది. ప్రతి రైతు రెండు సీజన్లలో ట్రాక్టర్పైనే ఆధారపడి ఎవుసం చేస్తున్నరు. అంతకు ముందు నాకు ట్రాక్టర్ లేకుండే. డ్రైవర్‌గా పని చేసిన. పని సరిగ్గా ఉండక జీతం కూడా రాకపోయేది. కానీ నీళ్లు వచ్చి ఎవుసం పెరుగడంతో లోన్ తీసి నాలుగేండ్ల కింద ట్రాక్టర్ కొన్నా.
కొన్నప్పటి నుంచి వట్టిగా లేదు. ఎపుడు ఏదో గిరాకీ తగులుతుంది. కష్టపడి పనిచేసుకుంటూ లోన్‌ను తెరపుకుంటున్నా. నేను బతుకుతున్నా. భూములను అచ్చుకట్టుడు, రాళ్లను తీసేసుడు, దుక్కి, దున్నకాలతో ఎపుడు పని ఉంటుంది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తెవడంతో మా మానేర్ నిండింది. దీంతో పాటు వర్షాలు కూడా మంచిగా పడుతుండడంతో ట్రాక్టర్లను రైతులు తీసుకుపోతున్నారు.
నాడు బీళ్లు ఉన్నా భూములన్నీ పంటలు పండిస్తూ పచ్చగా చేసుకుంటున్నారు. రెండు పంటల సీజన్ వచ్చినప్పుడు చేతినిండా పనిఉంటుంది. తిందామంటే తీరడం లేదు. వరి కోతలు అపుడు వడ్లను కేంద్రాలకు, రైస్‌మిల్లులకు తీసుకుపోతున్నాం. గడ్డి తీసుకొచ్చుడు తీసుకపోవుడుతో ఎప్పటికీ పని ఉంటుంది. సీఎం కేసీఆర్ సార్ చేయవట్టి ఎవుసంతోపాటు మాకు పని దొరికి కుటుంబాలను పోషించుకుంటున్నాం.
– డీ శేఖర్, ట్రాక్టర్ యజమాని, పోతుగల్, ముస్తాబాద్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా
కేసీఆర్ సీఎం అయినంక సాగుకు ఢోకా లేదు..
తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయినతర్వాత సాగు నీళ్లకు ఢోకా లేకుండ పోయింది. ఉమ్మడి రాష్ట్రంల బావుల్లో నీళ్లు, కరెంటు లేక ఏండ్లకేండ్లు భూములను బీడు పెట్టినం. అప్పుడు మాకు ఎంత భూమి ఉన్నా ఏం పాయిదా లేదు. వేరే పని చేసుకుంట బతికినం. అరిగోసపడ్డం. కేసీఆర్ సారు రైతుల బాధలు తెలుసుకొని ఎవుసాన్ని పండుగలా చేసిండు. ఫ్రీ కరెంట్, రైతుబంధు, పుష్కలంగా నీళ్లు ఇస్తండు. మా రైతుల జీవితాలే మారిపోయినయి. పుష్కలంగా పంటలు పండుతున్నయి.
– మరిమడ్ల శ్రీనివాస్ రైతు, చొప్పదండి
30 గుంటల మడి కూడా పారలే
నాకు మా ఊళ్లే రెండెకరాల భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంల నీళ్లు లేక, కరెంట్ ఉండక చానా ఇబ్బందులు పడ్డ. అప్పుడు కరెంట్ పొద్దంతా మూడు గంటలు.. రాత్రి నాలుగు గంటలు ఉండేది. రాత్రి పూట కరెంట్ కోసం జబ్బకు చెద్దరి, చేతిలో కట్టె, టార్చి లైటు పట్టుకొని పొలంకాడికి పోయేది. నా భూమి గుట్ట పక్కనే ఉండడంతో ఎటు నుంచి ఏ జంతువు వస్తుందోనని మస్తు భయమయ్యేది. నాలుగు గంటల కరెంట్ కూడా నాలుగు సార్లు పోయచ్చేది. రాత్రి, పొద్దంతా మోటర్ నడిచినా 30 గుంటలు కూడా పారకపోయేది.
ఇగ ఇట్లయితే బతుకుడు కష్టమేనని పదేండ్లు దుబాయి పోయిన. తెలంగాణ వచ్చి, ఇక్కడ అంతామారిపోయిందని తెలిసి వచ్చిన. కేసీఆర్ సారు సీఎం అయిన తర్వాత చెరువులు బాగు చేయించిండు. అనేక ప్రాజెక్టులు కట్టి ఎవుసాన్ని బంగారం చేసిండు. నా పొలం పక్క నుంచే గ్రావిటీ కెనాల్ పడ్డది. నీళ్లకు ఢోకా లేకుంట పోయింది. భూగర్భ జలాలు పెరిగినయి. దీనికి తోడు సర్కారు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తుండడంతో రంది లేకుంట ఎవుసం చేసుకుంటున్నం. ఇన్నాళ్లూ మా ఊరి చుట్టూ బీడు పడ్డ భూములన్నీ సాగులోకి అచ్చినయి.
నేను ఎకరంన్నరలో వరి, 20 గుంటలల్ల కూరగాయలు పండిస్తున్న. రేటు లేనప్పుడు పల్లి, నువ్వులు వేస్తున్న. నేనే మార్కెట్ పోయి అమ్ముకుంటున్న. ఇప్పుడు రాత్రి పూట కరెంట్ పెట్టాలన్న రంది లేదు. బావిలో నీళ్లు దంగుతాయాన్న బాధ లేదు. ఇంకా బీడు భూములన్నీ సాగులోకి రావడంతో నాకున్న రెండు ఎడ్లతో పత్తిలో అచ్చుకొట్టే పని కూడా చేత్తన్న. అట్లా కూడా నాకు ఉపాధి దొరుకుతంది. ఇంకా నా రెండెకరాలకు పసలుకు రూ.10 వేల రైతు బంధు కూడా అస్తంది. మొన్ననే రూ.70వేల రుణమాఫీ కూడా అయ్యింది.
– మెట్ట మల్లేశం, రైతు, నల్లగొండ, కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా
నెలకు రూ.50వేలు సంపాదిస్తున్న..
నా పేరు చాగంటి రాజశేఖర్. మాది ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్. నేను ఏడేండ్ల క్రితం గల్ఫ్ పోయి నాలుగేళ్లు ఉండి వచ్చిన. అక్కడ కూడా ఏం లాభం లేదు. రూ.15వేల నుంచి రూ.20వేలకు మించి సంపాదన ఉండకపోయేది. ఉన్న ఊరు, కన్నోళ్లను విడిచి పెట్టి గల్ఫ్ దేశంల ఎన్నో పాట్లు పడ్డ. కానీ మన రాష్ట్రం మనకు వచ్చి కేసీఆర్ సీఎం అయినంక అందరి బతుకులు మారినయి. చెరువులు, కుంటలు బాగైనయి. ప్రాజెక్టులు కట్టడంతో కాలువల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నయి.
ఇపుడు ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి. దీంతో నేను మూడేండ్ల క్రితమే వరికోత మిషన్(హార్వెస్టర్) డ్రైవింగ్ నేర్చుకున్న. డ్రైవర్‌గా పోతే నెలకు రూ.50వేలపైగా జీతం ఇస్తూ మూడు పూటల భోజనం కూడా పెడుతున్నారు. ఏడాదిలో దాదాపు ఎనిమిది నెలల పని దొరుకుతది. ఇన్ని రోజులు బీడుపడ్డ భూములన్నీ సాగైతున్నయి. చాలా మంది హార్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నరు. డ్రైవర్ల కొరత ఉండుడుతోటి సీనియర్లకు మంచి జీతం ఇస్తున్నరు.
ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు, రుణమాఫీ, ఫ్రీ కరెంట్, పుష్కలంగా నీళ్లతో ఎందుకు పనిరాని భూముల్లో కూడా రత్నాల్లాంటి పంటలు పండిస్తూ మాలాంటి ఎంతో మంది రైతన్నలకు ఉపాధి కల్పిస్తున్నరు. నేను నడిపించే వరికోత మిషన్‌కు సీజన్లో ముగ్గురం ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని అయిపోతది. మన తెలంగాణలో ట్రాక్టర్ హార్వెస్టర్ డ్రైవర్లకు ఉన్న డిమాండ్ దేశంలో ఎక్కడా లేదు. సముద్రాలు దాటి పోయి గల్ఫ్ దేశం పని చేసినా ఇంత జీతం ఇచ్చే పరిస్థితి లేదని ఇక్కన్నే హార్వెస్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న. ఇదంతా కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దయతోనే.
– చేగంటి రాజశేఖర్, హార్వెస్టర్ డ్రైవర్, హరిదాస్‌నగర్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా
ఏటా ఎక్సెస్ వర్ష పాతమే
తెలంగాణ ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఏటా అధిక వర్షపాతమే నమోదవుతోంది. వర్షాలు అనుకూలిస్తున్నాయి. ఒకప్పుడు వానల కోసం ఎదురు చూసే రైతులు ఇప్పుడు కాస్త ఆలస్యమైనా ఎంతో ధైర్యంగా పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చింది. వానలు అనుకూలించని పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేస్తుందనే నమ్మకం రైతుల్లో పెరిగింది. ఇందుకు అనుగుణంగానే ప్రతి ఏటా ప్రాజెక్టుల ద్వారా వానకాలం, యాసంగి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు కాస్త ఆలస్యమైనా ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేసింది. ఆ తర్వాత జూలైలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో కాస్త మందగించినా ఈ నెలలోనూ భారీ వర్షాలు కురిశాయి.
చేతినిండా పని
ఒకప్పుడు సాగునీరు లేక, చేతినిండా పని దొరకక కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ ప్రాంతం.. స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు చేపట్టిన చర్యలతో పుష్కలమైన నీటితో సస్యశ్యామలంగా మారింది. అడవుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు మొక్కలు నాటి అటవీ సంపదన పెంచడంతో వానలు సమృద్ధిగా కురుస్తున్నాయి.
మరోవైపు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టడడం, వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించడంతో పుష్కలమైన నీటి వనరులు లభ్యమయ్యాయి. ఫలితంగా రైతులు బీడు భూములను సైతం సాగులోకి తెచ్చి పుష్కలంగా పంటలు పండిస్తుండడంతో ప్రతి ఒక్కరికీ చేతినిండా పని దొరికింది. అంతే కాకుండా, ఒకప్పుడు ఇక్కడి నుంచి వలసలు వెళ్లగా, నేడు ఈ ప్రాంతానికే ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వచ్చి ఉపాధి పొందుతున్నారు.
రికాం లేకుంట పనిదొరుకుతంది..
కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి బతుకులు బాగుపడ్డయి. రైతులు పుష్కలంగా పంటలు పండిస్తున్నరు. ఆ పంటలతోటి మాకు చేతినిండా కూలి పనిదొరుకుతంది. తెలంగాణ రాక ముందు సకగా పంటలు పండక మాకు కూలీ పనులు దొరక్కపోయేది. దొరికిన పని చేసుకుంట బతికినం. పని లేన్నాడు పస్తులున్నం. కేసీఆర్ సారు వచ్చిన తర్వాత చెరువులు, కుంటలు మంచిగ చేసిండు. పుష్కలంగా నీళ్లు ఉంటున్నయి. 24 గంటల కరెంటు ఇస్తండు. నాడు ఏండ్లకేండ్లు బీడున్న పొలాలన్నీ సాగైతున్నయి. మా కూలోళ్లకు డిమాండ్ పెరిగింది. రోజుకు రూ. 500 దాకా సంపాదిస్తున్నాం.
– కాడె రత్నయ్య, కూలీ, చొప్పదండి