Control crime | కోనరావుపేట, జూలై 11: ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని, నేరాల నియాత్రణయే లక్ష్యంగా గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారిస్తూ గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే పోలీసులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకొని పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేశారు. కోనరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్పీ శుక్రవారం తనిఖీ చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 5ఎస్ అమలు చేసిన తీరు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క డ్యూటీలు వారికి ఉన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకుని, రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ గా మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా తరచు గ్రామాలు పర్యటిస్తూ ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులు తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు.
బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది, అధికారులు పెట్రోలింగ్ సమయంలో స్టేషన్ పరిధిలోని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కఠినతరం చేస్తూ తరచూ తనిఖీ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తునే వాటి వలన కలుగు అనర్ధాలపై, సైబర్ నెరల నియంత్రణ పై చైతన్య పరచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు.
మల్కపేట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలసి మొక్కలు నాటిన అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు ప్రారంభించి వారితో కలసి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.