Siricilla | సిరిసిల్ల టౌన్, జూలై 3: ప్రతీ సమస్యకు పరిష్కారం మార్గం ఉంటుందని, సమస్యపై కాకుండా పరిష్కార మార్గాలపై దృష్టిసారించాలని న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూనగర్ లో నేత కార్మికులకు మానసిక ఆరోగ్యంపై గురువారం గ్రూప్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు ఎదురైనప్పుడు సానుకూల దృక్పదంతో ఆలోచన చేయాలని తెలిపారు.
మద్యపాన వ్యసనంతో బాదపడుతున్న వారు ప్రభుత్వ ఆసుపత్రిలో తమను సంప్రదిస్తే మద్యపాన వ్యసనం నుండి విముక్తి కల్పిస్తామని చెప్పారు. తంబాకు, బీడి, సిగరెట్ అలవాట్లతో అనేక శారీరక, మానసిక రుగ్మతలు వస్తాయని అన్నారు. చెడు అలవాట్ల కారణంగా గుండె, చాతీలో మంట, అల్సర్, కాలేయ దెబ్బతినడం, మెదడు, నరాలు దెబ్బతిని మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు.
మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులలో అధికంగా నిద్ర సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు మందులు, కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి మానసిక సమస్యలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో తమను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది. నేత కార్మికులు, తదితరులున్నారు.