వానకాలం లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. హైలెవల్ వంతెనలు నిర్మించి అవస్థలు తీర్చాలని బోయినపల్లి మండల ప్రజలు కోరుతున్నారు.
బోయినపల్లి రూరల్, జూలై 10: బోయినపల్లి మండలంలోని పలువాగులపై ఉన్న లో లెవల్ వంతెనలతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. వర్షాలు కురిసినప్పుడు వాగులు ఉప్పొంగి కల్వర్టులపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వర్టులు నీటిలో మునుగుతుండగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బోయినపల్లి మండల కేంద్రం సమీపంలో మామిడి తోట కూడలి వద్ద లో లెవల్ వంతెన పైనుంచి వర్షాకాలంలో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో మండలంలోని బూరుగుపల్లి, కోరెం, అనంతపల్లి, దుండ్రపెల్లి గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లలేక ఇబ్బందులు ఎదురొంటున్నారు. బోయినపల్లి నుంచి కొదురుపాక వెళ్లే రహదారిపై మోడల్ సూల్ సమీపంలో వాగుపై ఉన్న మరో లో లెవల్ వంతెన పైనుంచి కూడా వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో దేశాయిపల్లి, రత్నంపేట, కొదురుపాక, జగ్గారావు పల్లి, రామన్నపేట గ్రామాల ప్రజలు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో దవాఖానకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వరదనీరు ప్రవాహంలో కల్వర్టు దాటడానికి ప్రయత్నించి ప్రమాదాలకు గురవుతున్నారు.
బోయినపల్లి మండలం నుంచి వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారిలో స్తంభంపల్లి వద్ద గంజి వాగుపై నిర్మిస్తున్న హై లెవల్ వంతెన పనులు పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. తాతాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు చిన్నపాటి వర్షానికి కొట్టుకుపోతోంది. అసంపూర్తిగా ఉన్న హై లెవల్ వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని స్తంభంపల్లి ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు పాదయాత్రగా మరోమారు బైక్ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. అయినా పనుల్లో ఎలాంటి కదలిక లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు చొరవ తీసుకొని హై లెవెల్ వంతెన నిర్మాణాలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రజలు ఇకడి నుంచి వేములవాడకు నిత్యం రాకపోకలు నిర్వహిస్తుంటారు. వర్షాకాలంలో వరద నీరు ఎకువ రావడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మేం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ వానకాలం ప్రారంభమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి.