కోనరావుపేట, మార్చి 12: చుట్టూ ప్రాజెక్టులున్నా సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన రైతు మోహిన్రెడ్డి వాటర్ ట్యాంకర్‌తో తన రెండెకరాల పంటలకు నీరందిస్తున్నాడు. పక్కనే మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ఉన్నా నీళ్లు రావడం లేదని, బోర్ల్లు అడుగంటాయని వాపోతున్నాడు. 3లక్షల రూపాయలు వెచ్చించి నాలుగు బోర్లు వేసినా ఒక్క బోరులోనూ చుక్క నీరు పడలేదని ఆవేదన చెందుతున్నాడు. ఈ పరిస్థితుల్లోనే పొట్ట దశలో ఉన్న రెండెకరాల వరి పంటను కాపాడుకునేందుకు వెయ్యి రూపాయలకో ట్యాంకర్ చొప్పున ఐదు ట్యాంకర్లతో నీటిని తెప్పించి, పొలానికి పారించానని చెప్పాడు.
15న జాబ్‌మేళా
జగిత్యాల రూరల్, మార్చి 12: జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 15న జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పద్మజ సుజికి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సర్వీస్ సలహాదారులు (ఇద్దరు), సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేన్ (ఒకరు), క్యాషియర్ (ఒకరు), టెక్సిషియన్ (ఒకరు) పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనీసం డిగ్రీ, ఐఐటీ ఉత్తీర్ణత కలిగి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, ఎంపికైన వారికి నెలకు రూ.12వేల నుంచి రూ.15వేల వేతనం ఇస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.