Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 13: దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచే తమ డివిజన్లో అరిష్టంతో ఇంటింటికి విష జ్వరాలతో బాధపడుతున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ పేర్కొన్నారు. ఫైవ్-ఇంక్లైన్ బస్తీ ప్రజల విన్నపం మేరకు ఆ ప్రాంతంలో కూల్చిన మైసమ్మ గుళ్ల వద్ద బుధవారం రాత్రి శాంతి పూజలు నిర్వహించారు. మైసమ్మ తల్లికి జంతు బలిచ్చి అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
అనంతరం రవీందర్ మాట్లాడుతూ సింగరేణి కార్మిక వాడ ఫైవింక్లయిన్ కాలనీలోని దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచి గోదావరిఖనికి అరిష్టం పెట్టుకుందనీ, పైగా తమ డివిజన్లో అనేక మంది విష జ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారనీ, బస్తీ పెద్దల సూచన మేరకు మైసమ్మ తల్లి శాంతించాలని ఈ పూజలు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం డ్యూటీలకు వెళ్లే సింగరేణి కార్మికులు ముందుగా ఫైవ్-ఇంక్లైన్లోని దారి మైసమ్మ గుడి వద్ద మొక్కుకొని వెళ్తుంటారన్నారు.
అలాంటి గుళ్లను కూల్చి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిని మైసమ్మ తల్లి ఊరికే వదిలిపెట్టదన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్, నాయకులు రాస మల్ల విజేందర్, మేకల నవీన్, సంద వేణ కుమార్, అనవేన మహేందర్, వెంకటి, రవీందర్ రెడ్డి, గూడెం రమేష్, బొడ్డుపల్లి సంపత్, శివ, దుస్స వెంకన్న, లక్ష్మీనారాయణ, భోగ రాములు, గురజాల సంపత్, కేశవ చారి, తోడేటి శంకర్ గౌడ్, స్వరూప, జనార్ధన్, మోహన్ తో పాటు అధిక సంఖ్యలో బస్తీ పెద్దలు పాల్గొన్నారు.