Fire accident | వినాయక్ నగర్, సెప్టెంబర్ 28 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ ప్రాంతంలోనీ ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లోని లోపలి గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగి గదిలోని వస్తువులకు మంటలు అంటుకోవడంతో దాన్ని గమనించి ఇంటి యజమాని మహమ్మద్ అబ్దుల్ ఖాన్ మంటలు ఆర్పేందుకు గదిలోకి వెళ్లారు. గదిలోకి వెళ్లిన ఆయన కాళ్లకు మంటలు అంటుకోవడంతో అది గమనించి ఆయన కుమారుడు మొహమ్మద్ అబ్దుల్ సాదుల్ మంటలు వ్యాపించిన గదిలోకి వెళ్లాడు.
దీంతో భారీగా చెలరేగిన మంటల్లో తండ్రి కొడుకులు ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంట్లోంచి భారీగా మంటలతో కూడిన దట్టమైన పొగలు బయటకు రావడానికి గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లోని గదిలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. నాలుగో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదం జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. మంటల్లో తీవ్ర భగాయాల పాలైన తండ్రి కొడుకులను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై అగ్నిమాపక, పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.