మానకొండూర్ రూరల్, ఆగస్టు 8 : మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వారి ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రతి మహిళా ఆరోగ్య మహిళా కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ మండలం అన్నారం గ్రామ పంచాయతీలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. అన్నారంలో 1544 మంది మహిళలకు గానూ 1200 మంది ఆరోగ్య మహిళా కార్యక్రమంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం సంతోషదాయకమన్నారు. మిగిలిన వారు కూడా ఈ సదుపాయం వినియోగించుకోవాలని సూచించారు. పలువురు మహిళలు ‘శుక్రవారం సభ’ నిర్వహణపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ పలువురు గర్భిణులకు సీమంతం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, సీడీపీవో శ్రీమతి, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.
కార్పొరేషన్, ఆగస్టు 8: కరీంనగర్లోని ప్రకృతి వనాలను మరింతగా అభివృద్ధి చేయాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం స్థానిక బైపాస్ రోడ్డులోని పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. నీటికొలనులో కలువ మొక్కలను పెంచాలన్నారు. పట్టణ ప్రకృతి వనాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రపుల్ దేశాయ్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.