Anti-labor policies | జ్యోతినగర్, ఆగస్టు 23: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఫెడరేషన్ కమిటీ పోరాడుతుందని సెంట్రల్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీంపాషా అన్నారు. ఎన్టీపీసీ వేదికగా టౌన్షిప్లోని జ్యోతిక ఫంక్షన్హాల్లో శనివారం ఆల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఎగురవేసి, జ్యోతిప్రజ్వన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
దేశానికి వెలుగులు అందిస్తున ఎన్టీపీసీ కార్మికులు భాగస్వామిగా పనిచేసిన కేంద్రం, ఎన్టీపీసీ యాజమాన్యం చేపడుతున్న వ్యతిరేక విధానాల ద్వారా ఉద్యోగుల్లో పనిభారం పెరిగి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వారి సంక్షేమం, హక్కులను అమలుపరుచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో జరుగుతున్న రిటైర్డుమెంట్లతో ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. కంపెనీ ప్రభావిత నిర్వాసితులకు, స్థానిక నిరుద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగావకాశాలు కల్పించాలని ఈ జాతీయ కన్వేషన్ తీర్మాణం చేసిందన్నారు.
ప్రధానంగా బీజేపీ ప్రభుత్వ చేపట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలకు విరుద్ధంగా ఈ సమావేశం తీర్మాణించి సెప్టెంబర్లో ఢిల్లీలో నిర్వహించే ఎన్బీసీ సమావేశంలో సమస్యలపై యాజమాన్యంను నిలదీయనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఎన్టీపీసీ అడిషనల్ ఎస్బీసీ మెంబర్ చంద్రవంశీ, రామగుండం ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్యతో పాటు జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ వ్యాప్తంగా ప్రాజెక్టులకు చెందిన యూనియన్ ప్రతినిధులు ధర్మేంద్ర, ప్రదాన్, సత్యనారాయణ సాహు, 70మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు.