విషజ్వరాలు ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయపెడుతున్నాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఇంటినీ చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో ఆర్ఎంపీల నుంచి మొదలుకొని.. జిల్లా ప్రధాన దవాఖానల వరకు జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా పలు ప్రైవేట్ దవాఖానలు దోచుకుంటున్నాయి. ఇప్పటికే డయాగ్నోస్టిక్ కేంద్రాలు నిర్ధారణ పరీక్షల ధరలను ఆడ్డగోలుగా పెంచాయి. దీని వల్ల రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో రోగాల నియంత్రణతోపాటు ప్రభుత్వపరంగా మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రైవేట్ దోపిడీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క మంత్రి సమీక్షించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్రత ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మంత్రులు, అధికారులు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో ఎప్పుడూ లేని విధంగా జ్వరాలు ఈ సారి ఉమ్మడి జిల్లాను వెంటాడుతున్నాయి. పక్షం రోజులుగా పట్టి పీడిస్తున్నాయి. ఓవైపు చికున్‌గున్యా, మరోవైవు వైరల్ ఫీవర్, ఇంకోవైపు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఏక కాలంలో రావడంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీటితోపాటు విపరీతమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, దగ్గు, ఉబ్బుసం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇవేకాకుండా శరీరంపై దురద, కళ్ల నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలతో సతమతమవుతున్నారు. రాత్రివరకు బాగానే ఉన్నా తెల్లారే సరికి తీవ్ర జ్వరం బారిన పడుతున్నారు. వైద్యశాఖాధికారుల గణాంకాల ప్రకారం చూస్తే.. పెద్దపల్లి జిల్లాలో 15,300, రాజన్న సిరిసిల్లలో 16వేలు, జగిత్యాల జిల్లాలో 18వేలు, కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా దాదాపు 49వేల మంది జ్వరం బారిన పడ్డారు. పలు జిల్లాల్లో డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.
ప్రస్తుతం ఇంత జ్వర తీవ్రత పెరగడానికి వాతావరణ మార్పులతోపాటు ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం కారణమన్న విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా వానకాలం వచ్చిందంటే గతంలో దోమల నివారణకు అనేక చర్యలు చేపట్టేవారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి డ్రైనేజీలను క్లీన్ చేసేవారు. కాలనీల్లో చెత్తాచెదరాన్ని తొలగించేవారు. డ్రైడేలు పాటించేవారు. నిబంధనల ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే వారు. ముఖ్యంగా సాయంత్రం దోమల నివారణకు ఫాగింగ్ చేసే వారు. కానీ, ప్రస్తుతం మెజార్టీ ప్రాంతాల్లో అవేవీ కనిపించడం లేదు. చాలా చోట్ల ఫాగింగ్ యంత్రాలు మూలన పడ్డాయి. పట్టణాల్లో ఈ సారి స్పెషల్ డ్రైవ్‌లపై ఫోకస్ తగ్గింది. పల్లెల్లో పాలకవర్గాలు లేకపోవడం, నిధులు రాకపోవడంతో ప్రత్యేకాధికారులు ఏమిచేయలేని దుస్థితి. ఇవన్నీ జ్వరాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి.
నిజానికి ఇంత తీవ్రత ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ఇన్చార్జి మంత్రులు ప్రతి వారం పదిరోజులకోసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. జ్వరాలు ఇంతలా ప్రబలడానికి కారణాలు అన్వేషించాలి. దవాఖానలు సందర్శించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకోవాలి. అవసరమైతే అధికారులకు ఆదేశాలు ఇచ్చి తగిన వసతులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులతో సమీక్షించాలి. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయో గుర్తించి నివారణ మార్గాలు చూపాలి. ఓవైపు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు అందేలా చూస్తూనే.. మరోవైపు ప్రైవేట్ దవాఖానలపై కన్నేయాలి. అక్కడ జరిగే అడ్డగోలు దోపిడీ విధానాన్ని అరికట్టేందుకు అవసరమైతే ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసి.. అది 24 గంటల పాటు రన్ అయ్యేలా చూడాలి.
పేషెంట్ల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి.. వాటిని పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. కానీ, ఇవేవి కనిపించడం లేదు. ఎవరైనా జిల్లా వైద్యాధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే వారు ఫోన్ ఎత్తరు. అందుకే ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోగ నిర్ధారణ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్లు.. ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచాయి. దీనిపై రోగులు, పలు సంఘాల నాయకులు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటువంటి అంశాలను సమీక్షించి.. ప్రస్తుత సంకటస్థితిలో పాత ధరలు అమలు అయ్యేలా మంత్రులు సమీక్ష సమావేశాల్లో నిర్ణయాలు తీసుకొని.. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. కానీ, ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు.
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు కావాల్సిన అన్ని మందులున్నాయని చెబుతున్నా ప్రస్తుత సమయంలో ఉండాల్సిన రెండు రకాల అసలైన మందులు మాత్రం రెండు నెలలుగా రావడం లేదు. అందులో అజిత్రోమైసిన్, డైక్లో ట్యాబ్లెట్లు లేవు. బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్లకు, జీర్ణశాయంతర అంటువ్యాధులు, ఉపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, కోరింత దగ్గు, వంటివాటికి అజిత్రోమైసిన్ వినియోగిస్తారు. నొప్పులకు డైక్లో ట్యాబ్లెట్స్ వాడుతారు. ప్రస్తుతం ఏ జ్వర పీడితున్ని చూసినా నొప్పుల తీవ్రతతో బాధపడుతున్నారు. ఈ మందులు లేవని రెండు నెలులుగా ప్రభుత్వానికి నివేదికలు వెళ్తున్నాయే తప్ప అక్కడి నుంచి మాత్రం రావడం లేదు. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో ఉన్నది.
జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ఉమ్మడి జిల్లాకు కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చారు. అందులోనూ ఆయన ఒకేఒకసారి జిల్లా అభివృద్ధిపై సమీక్ష జరిపి వెళ్లిపోయారు. అలాగే ఉమ్మడి జిల్లా మంత్రులుగా చెబుతున్న శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ కూడా ప్రస్తుత వైరల్ ఫీవర్స్‌పై సమీక్షలు పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా మంత్రులు స్పందించి, పెరుగుతున్న జ్వరాల తీవ్రతను గుర్తించి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. ప్రధానంగా రోగుల్లో మనోనిబ్బరాన్ని నింపడమే కాదు, ప్రత్యక్షంగా పేషెంట్లను కలిస్తే అందుతున్న సౌకర్యాలు తెలుస్తాయి. అలాగే ప్రైవేట్ రంగంలో జరుగుతున్న దోపిడీ అరికట్టేందుకు వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. సదరు బృందం నిరంతరం తనిఖీలు చేసి, రోగుల జేబులకు చిల్లులు పడుకుండా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వారం నుంచి నాకు జ్వరం వస్తుంది. పెద్దపల్లి జిల్లా దవాఖానలనే చూపిచ్చుకున్న. ఇంటికాన్నే మందులు మింగిన. మొన్నటి నుంచి కాళ్లు, చేతుల కీళ్ల మధ్య నొప్పి వస్తంది. మొన్ననే ఇకడికి వచ్చిన. రక్త పరీక్ష చేసిన్రు. బెడ్ ఇచ్చిన్రు. నొప్పులు తగ్గుతలెవ్వు. డాక్టర్లు మంచిగ పట్టించు కుంట లేరు. బెడ్ల పడి సచ్చుడేకానీ పట్టిచ్చుకునేటోళ్లు లేరు.
-సిలుముల లావణ్య, పెద్దపల్లి