Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం నర్సింహులపల్లిలో సోమవారం నిర్వహించిన శ్రీ లక్ష్మినర్సింహాస్వామి, శ్రీసీతరామస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివార్ల రథోత్సవంతో గ్రామంలోని వీధులన్నీ భక్తి భావంతో నిండిపోయాయి. కోట్ల నర్సింహులపల్లి తో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రథోత్సవంలో పాల్గొని, స్వామివార్ల దర్శనాన్ని చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట కవిత మల్లారెడ్డి, నాయకులు పబ్బతి తిరుపతిరెడ్డి, రాచమల్ల రవి, రాచమల్ల భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు.