Father and Son | రామగిరి, జనవరి 1 : నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ, రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) గత కొన్ని నెలలుగా పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యుల సంరక్షణలో ఇంటివద్దే చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు.
రాజేశం మృతి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. ఇదే సమయంలో ఆ కుటుంబాన్ని మరో పెద్ద విషాదం వెంటాడింది. రాజేశం రెండో కుమారుడు ఎరుకుల శ్రీకాంత్ (37) బుధవారం రాత్రి ఛాతీలో తీవ్రమైన నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా అక్కడ శ్రీకాంత్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున మృతి చెందాడు. శ్రీకాంత్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతిని తేరుకునేలోపే కొడుకు మరణవార్త కుటుంబాన్ని పూర్తిగా కుంగదీసింది.
ఒకే ఇంట్లో ఒకే రోజున రెండు చావులు సంభవించడంతో ఆ ఇంట్లో రోధనలు మిన్నంటాయి. కొత్త సంవత్సరం రోజున ఈ దుర్ఘటన జరగడంతో నాగేపల్లి గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆ కుటుంబాన్ని పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేశారు. ‘ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని, మాటలకు అందని బాధ’ అంటూ పలువురు కన్నీరు మున్నీరయ్యారు. ఆనందం, ఆశలతో మొదలవాల్సిన నూతన సంవత్సరం నాగేపల్లిలో మాత్రం తండ్రి-కొడుకు మరణంతో విషాదంగా ప్రారంభమైంది.