Outsourcing staff | ధర్మపురి, సెప్టెంబర్ 20: తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్, సానిటేషన్ సిబ్బంది ఆరునెలలుగా జీతాలు రాక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పండుగ పూట నైనా కడుపునిండా తినేటట్లు జీతాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ధర్మపురిలో ఉద్యోగులు దవాఖాన ముందు ధర్నా శనివారం చేపట్టారు. జగిత్యాల జిల్లాలో ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ లో వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.
ఈ నాలుగు ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 250 మంది సానిటేషన్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన (స్వీపర్లు, సెక్యూరిటీగార్డులు, పేషంట్ కేర్, ల్యాబ్, మెడికల్, ఏఎన్ఎమ్, జీఎన్ఎమ్) సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే వీరికి గత ఆరుమాసాలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండుగ సందర్భంగా నైనా జీతాలు ఇవ్వాలని కోరుతూ ధర్మపురి దవాఖానలో పనిచేసే 16 మంది సిబ్బంది శనివారం దవాఖాన ముందు ధర్నా చేశారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ రవికి వినతి పత్రం అందజేశారు.
కూరగాయలు కొందామంటే పైసలు లేవు.. : శనిగరపు గంగు, స్వీపర్
ధర్మపురి దవాఖానలో స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. నెలకు రూ.12 వేల జీతం వస్తది. భర్త లేడు. దవాఖానలో పనిచేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న. ఆరోగ్యం సహకరించకపోయినా పని చేస్తున్న. గత ఆరునెలలుగా జీతాలు రాక కూరగాయాలు కొనుక్కుందామంటే పైసలు లేవు. 10 రోజుల్లో దసరా పండుగ ఉన్నది. జీతం రాకపోతే పండుగ జరుపుకునుడెట్లనో అర్థం కావడం లేదు.అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలి.
తలుచుకుంటేనే దుఃఖమొత్తాంది..: కొప్పుల భాగ్య, స్వీపర్
ధర్మపురి ప్రభుత్వ దవాఖానలో స్వీపర్‌గా పనిచేస్తున్న. ఆరు నెలలుగా జీతాలు వస్తలేవు. అడిగితే ఎందో ప్రాబ్లం అంటున్నరు. మా ప్రాబ్లం పట్టించుకుంటలేరు. అప్పులు చేసి బతుకుతున్నం. సగం కడుపుకే తింటున్నం. పండుగ పూటనైనా కడుపు నిండా తినేటట్లు జీతం ఇయ్యాలె సారూ బాంచెన్..!