మానకొండూర్ రూరల్ ఫిబ్రవరి 13 : నాట్లేసి పోట్టకొచ్చే దశలో రైతన్నలకు మల్ల యూరియా కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం రైతన్నలకు తీసుకొచ్చిన ప్రత్యేక యాపు సైతం పని చేయదు, బస్తాలు దొరుక వాయే అంటూ ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామంలోని వెంకట సాయి ఫర్టిలైజర్ షాపుకు దాదాపు 220 బస్తాలు వచ్చినట్లు సమాచారం రావడంతో రైతన్నలు బారులు తీరారు. వచ్చిన 220 బస్తాలకు 300 నుండి 350 మంది రైతన్నలు క్యూ లైన్ లో నిలుచొని వేచి ఉన్నారు. లైన్లో ఉన్నవాళ్లు యాప్ కోసం వేచి చూస్తూ ఓటిపి వస్తుందా అని వేచి చూడడానికే సమయం అంతా వృధా అయ్యింది.
చదువురాని రైతులు యాప్ ద్వారా బస్తాలను బుక్ చేసుకోవడంలో మరింత కష్టాలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా యాప్ ద్వారా కాకుండా యధావిధిగా ఆప్‌లైన్‌లో ఇదివరకు ఇచ్చిన విధంగానే ఇస్తే బాగుండు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతన్నల కష్టాలను తొలగించేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు.