రాయికల్/ వేములవాడరూరల్/ ధర్మారం, మే 17 ; రైతాంగం అరిగోస పడుతున్నది. ధాన్యం కొనుగోళ్ల వేళ ఆదుకునే దిక్కులేక కన్నీరు పెడుతున్నది. మొన్నటిదాకా సాగునీరు లేక, కరెంట్ సరిగ్గా ఉండక అరిగోస పడి, పండించిన కొద్దిపాటి ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తే.. సకాలంలో కొనేవారు లేక ఆగమవుతున్నది. సెంటర్లకు వడ్లు తెచ్చి పదిహేను ఇరువై రోజులైనా కొనకపోవడం, మరోవైపు లారీల కొరతతో కొన్నది వెనువెంటనే మిల్లులకు తరలించకపోవడంపై మండిపడుతున్నది. అటు ధాన్యాన్ని, ఇటు బస్తాలను కాపుకాయలేక, అకాల వర్షానికి కాపాడుకోలేక ఆందోళన చెందుతున్నది. అక్కడక్కడ కండ్ల ముందే తడిసిపోతుండడంతో ఆవేదన చెందుతున్నది. కొద్ది రోజుల నుంచి ముప్పు వెంటాడుతున్నా పట్టించుకునే వారు లేక ఆగ్రహిస్తున్నది. శుక్రవారం మైతాపూర్, అనుపురంలో రైతులు కడుపుమండి రోడ్డెక్కారు. వెంటనే ధాన్యాన్ని కొనాలని, లారీల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉండగా, సకాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ధాన్యం కొనాలని..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్లో రైతులు ధర్నా చేశారు. గ్రామంలో కేంద్రం ఏర్పాటు చేసి పదిహేను రోజులవుతున్నా కనీసం 50 మంది రైతుల ధాన్యాన్ని కూడా కొనలేదని మండిపడ్డారు. కేంద్రంలో వసతులు లేవని, సరిపడా గన్నీ సంచులు లేవని, హమాలీలు, తూకం వేసే కూలీల కొరత ఉందని, ఇలా అయితే కొనుగోళ్లు ఎలా ముందుకెళ్తాయని ప్రశ్నించారు. లారీల కొరతతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించడం లేదని, వర్షానికి బస్తాలు తడిసిపోతున్నాయని వాపోయారు. ధర్నా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కొనుగోళ్లను వెంట వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
లారీల కొరత తీర్చాలని..
వేములవాడ రూరల్ మండలంలోని అనుపురం రైతులు రోడ్డెక్కారు. వేములవాడ -కరీంనగర్ రహదారి పై బైఠాయించి ధర్నా చేశారు. గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కొనడం లేదని, ఇంకా లారీలు రాకపోవడంతో బస్తాలు పేరుకుపోయి వర్షానికి తడుస్తున్నాయని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధర్నా విషయం తెలుసుకోని సీఐ వీరప్రసాద్ అక్కడికి చేరుకోని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. అలాగే కొనుగోలు కేంద్రాన్ని డీసీవో సందర్శించి బస్తాలను తరలిస్తామని హామీఇచ్చారు.
తడిసిన ధాన్యాన్ని కొనాలి..
మాది సూరయ్యపల్లి. ఊళ్లే మూడెకరాలల్ల వరి వేసిన. మొన్నటిదాకా సాగునీళ్లు రాక, కరెంట్ సరిగ్గా ఉండక అరిగోసపడ్డ. ఎట్లనో ఎల్లతీసుకొని పంట పండించుకున్న. తీరా వరి కోసి వడ్లు కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనేటోళ్లే లేరు. మా ఊరు పక్కనే ఉన్న మంథనిలోని ఏఎంసీ కొనుగోలు కేంద్రానికి 15 రోజుల కింద ధాన్యం తెచ్చిన. కానీ అధికారులు కాంటా పెట్టలే. ఏమైందని అడిగితే రేపు, మాపంటూ దాటేసిన్రు. అకాల వాన వచ్చి నా ఎకరంనర పంట తడిసిపోయింది. నా బాధ ఎవలికి చెప్పుకోవాలె. ముందే కొని ఉంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు. తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి.
– శ్రీనివాస్, రైతు, సూరయ్యపల్లి (మంథని)
లారీలు రాక గోసయితంది
మాది వేములవాడ మండలం అనుపురం. మా వడ్లను నాంపెల్లి సొసైటీవాళ్లు కొంటున్నరు. అనుపురంలోని కొనుగోలు కేంద్రానికి నెల రోజుల కింద వడ్లు తెచ్చినం. వడ్లను ఎండిబోసిన తర్వాత మాయిచ్చర్ రాగానే నాలుగు రోజులకు కాంట పెట్టిన్రు. కానీ, లారీలు రాక రామగోస అయితంది. ఇప్పటికీ ధాన్యం బస్తాలు సెంటర్లనే ఉన్నయి. ఓ వైపు వానలు పడుతున్నయి. ఎట్ల కాపాడుకోవాలో అర్థమైతలేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు, అప్పుడు అంటున్నరే తప్ప లారీలైతే వస్తలేవు. బస్తాలు తడిసేటట్టు ఉన్నయి.
– మురంచెట్టి లచ్చయ్య, రైతు (అనుపురం)
రైతులంటే పట్టింపులేదా..?
మా అనుపురం ఊళ్లే కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులు దాటింది. వడ్లు ఎండిన తర్వాత కాంట పెట్రిన్రు. బస్తాలల్ల నింపిన్రు. పదిహేను రోజుల సంది కేంద్రానికి లారీలే వస్తలేవు. ఎప్పుడో ఒకటి వస్తున్నా అందరి రైతుల బస్తాలు ఎక్కడ పోతయి. ఇంకా కేంద్రంలోనే సంచులు ఉన్నాయి. వానకు తడుస్తయనే రందివట్టుకుంది. మళ్లీ పంట సాగుచేసుకునే టైం కూడా వచ్చింది. లారీ తెప్పించాలని అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకుంటలేరు. ప్రభుత్వానికి మా రైతులంటే పట్టింపులేనట్టే ఉంది. అందుకే మాకీ గోస అచ్చింది. ఏం చేయాలో తెలువకనే రోడ్డుమీదకు వచ్చినం.
– మద్దెల భూమయ్య, రైతు (అనుపురం)
అదనపు కాంటాలు పెట్టాలె
మైతాపూర్లో 25 రోజుల కింద కొనుగోలు కేంద్రం పెట్టిన్రు. ఒకే కాంట ఉండడంతో కొనుగోలు లేటయితంది. పదిహేను రోజుల కింద వడ్లు తెచ్చినా ఇంకా కొనుడు కాలె. పొద్దంతా సెంటర్ ఉండి ధాన్యాన్ని కాపాడుకునేందుకే టైం అయిపోతంది. దీనికి తోడు అకాల వానలతో ఎప్పుడు ఏమైతదో అని భయమైతుంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని అదనపు కాంటాలు పెట్టి, పది రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనాలి.
– శివనీతి అమరేందర్, రైతు (రాయికల్)
కాపాడుకోలేక గోస పడుతున్నరు
సర్కారు మైతాపూర్లో నామమాత్రంగా సెంటర్‌ను పెట్టి చేతులు దులుపుకున్నది. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. ధాన్యం ఎక్కడిదక్కడే పేరుకుపోతంది. గన్నీ సంచుల్లేవు. హమాలీలు, లారీల కొరత ఉన్నది. మరోపక అకాల వానలు పడుతుంటే ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు గోస పడుతున్నరు. ఇట్లయితే కష్టమని రైతులు విధిలేని పరిస్థితిల్లో ప్రైవేటు వాళ్లకు అగ్గవకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఆదుకోవాలె.
– సద్ది మహిపాల్ పాల్ రెడ్డి, రైతు (మైతాపూర్)
నెల రోజులైనా కొంటలేరు
మా ఊరు మర్తనపేట. నేను ఆరెకరాల్లో వరి పండించిన. నెల కిందనే వరి కోసి వడ్లను మా ఊరి కేంద్రంల పోసిన. అప్పటి నుంచి వడ్లను కొనెటోళ్లు లేరు. రోజూ వడ్లను నేర్పుడు.. మబ్బుల పడితే కవర్లు కప్పుడే పనైతంది. మస్తు తిప్పలైతంది. టార్పాలిన్లు సరిగ్గా లేక వాన కొడితే ధాన్యం తడుస్తంది. ఇప్పటికే కొన్ని వడ్లు మొలకచ్చినయ్. అయినా ఎవరూ పట్టించుకునెటోళ్లు లేరు. చినుకు పడినప్పుడల్లా రైతులమందరం వణికిపోతున్నం. ఇట్ల రైతును అరిగోస పెట్టుడు మంచిది కాదు. తొందరగా ధాన్యం కొంటే మాకీ గోస వచ్చేది కాదు. ఇప్పటికైనా సర్కారు పట్టించుకోవాలె.
– మర్రిపల్లి పరశురాములు, రైతు, మర్తనపేట (కోనరావుపేట)
రైతులకు నష్టమే..
సారు మాది ధర్మారం మండలం నందిమేడారం. నేను రెండున్నర ఎకరాల్లో వరి పండించిన. పదిహేను రోజుల కింద వరి కోసం మా ఊరిలోని కేంద్రానికి వడ్లు తెచ్చిన. మంచిగా ఎండబెట్టిన. తేమ శాతం 17లోపు ఉందని సిబ్బంది చెప్పిన్రు. కానీ, మా లారీలు వస్తలేవని ధాన్యం తరలిస్తలేరు. గోనె సంచులు ఇస్తలేరు. నేను రోజు ఇక్కడే కాపాలా ఉండాల్సి వస్తంది. ధాన్యం కుప్పపై కవర్లు కప్పి ఉంచిన. వర్షానికి కుప్ప చుట్టు నీరు నిలుస్తంది. వాన పడ్డప్పుడల్లా భయమైతంది. కవర్‌పై నిలిచిన నీళ్లు తీసేసి కాపాడుకుంటున్న. రోహిణి కార్తె వచ్చే లోపల మా వడ్లు కొనకుంటే రైతులకు నష్టమే.
– సామంతుల స్వామి, రైతు (నంది మేడారం)