Power Cut | చిగురుమామిడి, సెప్టెంబర్ 11 : ప్రభుత్వం రైతులకు కరంటు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విద్యుత్ కోతతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. చిగురుమామిడి మండలం సుందరగిరి చౌరస్తా వద్ద సుందరగిరి బొమ్మనపల్లి, ఉల్లంపల్లి గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున ప్రధాన రహదారిపై మొక్కజొన్న, పత్తి పంట కర్రలతో రోడ్డుపై బైఠాయించి శుక్రవారం ఆందోళన చేపట్టారు. రోజుకు కనీసం 8 గంటలు కూడా కరంటు ఉండడం లేదని రైతుల బావులలో నీరు ఉన్నప్పటికీ కరంటును పంటలకు అందించలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తరచూ విద్యుత్ కోతతో పంటలకు నీరు అందించలేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి విద్యుత్ సమస్యపై తీసుకెళ్లినప్పటికీ సమాధానాలు దాటవిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై జగదీశ్వర్ పోలీసులు సంఘటనలు చేరుకొని ఆందోళన విరమించే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు ఒప్పుకోకపోవడంతో కొంతసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. చివరికి ట్రాన్స్కో ఏడీ నరేందర్ వచ్చి రైతులకు హామీ ఇవ్వడంతో రైతుల ఆందోళన విరమించారు.
సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు
సుందరగిరి ప్రధాన రహదారిపై విద్యుత్ కోతకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టడంతో బీఆర్ఎస్ నాయకులు రైతులకు సంఘీభావం ప్రకటించారు. వారితో పాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని, పంటలు ఎండి పోలేదని, రైతులకు 24 గంటలు కరంటు పంపించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ఎద్దేగా చేశారు. సంఘీభావం ప్రకటించిన వారితో సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ మండల నాయకులు, ఎంపీటీసీలు కత్తుల రమేష్, మిట్టపల్లి మల్లేశం, నాయకులు కంది శంకర్, తిరుపతి, రమేష్, ప్రవీణ్, భిక్షపతి, రాజయ్య, రావుల వెంకన్న, కాసరవెనీ ఓదెలు, సిరా రాజు, కొమురయ్య రైతులు పాల్గొన్నారు.